Share News

తిరుపతి జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:43 AM

నేడు భారీ వర్ష సూచన అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవు బీచ్‌లు, జలపాతాలకు రాకపోకల నిషేధం

తిరుపతి జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌
కోట మండలం శ్రీనివాససత్రం వద్ద పరవళ్లు తొక్కుతూ ముందుకు వచ్చి ఉన్న సముద్రం

తిరుపతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మంగళవారం జిల్లాకు భారీ వర్ష సూచన చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. సెలవులు పెట్టిన ఉద్యోగులు, అధికారులు జిల్లాలో అందుబాటులో ఉంటే.. సెలవులను రద్దు చేసుకుని విధుల్లో చేరాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచీ ఆయన రెవెన్యూ, పోలీసు, ఫైర్‌, వైద్యారోగ్య, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, వ్యవసాయ వంటి కీలక శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. సంబంధిత శాఖల క్షేత్రస్థాయి ఉద్యోగులు 24 గంటలూ కార్యక్షేత్రంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్వారీల్లో బ్లాస్టింగ్‌ పనులు ఆపేసి.. అక్కడ వినియోగించే ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లు సిబ్బందితో పాటు జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉంచాలన్నారు. ఇక, కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లోని సముద్ర తీర ప్రాంతంలో బీచ్‌ల వద్దకు పర్యాటకుల రాకపోకలను బుధవారం వరకూ నిషేధించారు. ఈ మూడుచోట్ల సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో ముందుజాగ్రత్తగా పర్యాటకులను అనుమతించడం లేదు. జిల్లాలోని అన్ని జలపాతాల వద్దకూ బుధవారం వరకు రావొద్దంటూ పర్యాటకులకు అధికారులు సూచించారు. ఇప్పటికే సోమవారం నుంచీ బుధవారం వరకూ మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. తుఫాను హెచ్చరికల తీవ్రత దృష్ట్యా కలెక్టరేట్‌, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట, గూడూరు ఆర్డీవో కార్యాలయాలతో పాటు అన్ని మున్సిపల్‌.. తహసిల్దారు కార్యాలయాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ పనిచేయనున్నాయి. సమస్యలపై ప్రజలు కంట్రోల్‌ రూమ్‌లకు సమాచారం ఇస్తే.. పరిస్థితికి అనుగుణంగా వారు స్పందిస్తారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నేరుగా ఫిర్యాదులు, సాయం కోసం అభ్యర్థనలు చేయడానికి, అత్యవసర సమాచారం ఇవ్వడానికి టోల్‌ ఫ్రీ నెంబర్‌ కూడా ప్రకటించారు.

తీర ప్రాంతంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

జిల్లాకు రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చాయి. కోట, వాకాడు, చిల్లకూరు వంటి సముద్ర తీర ప్రాంత మండలాలలో సహాయక చర్యల కోసం ఒక బృందాన్ని గూడూరులోను.. మరో బృందాన్ని సూళ్ళూరుపేటలో వుంచారు. పులికాట్‌ సరస్సు పరంగా ఇబ్బందులు తలెత్తితే తడ, సూళ్ళూరుపేట మండలాలకు, స్వర్ణముఖి, కాళంగి నదుల పరంగా ఇబ్బందులు ఎదురైతే నాయుడుపేట, శ్రీకాళహస్తి తదితర మండలాలకు త్వరగా చేరుకునేలా అక్కడ ఉంచారు.

Updated Date - Oct 28 , 2025 | 12:43 AM