Share News

శాఖల వారీగా భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ

ABN , Publish Date - Jun 20 , 2025 | 02:38 AM

శ్రీవారి భక్తులకు టీటీడీలో అందిస్తున్న సేవలపై క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ జరిపి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు భక్తుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌పై చర్చించారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందజేస్తున్న సేవలు, లగేజీ, కల్యాణకట్ట, వైద్యం, పారిశుద్ధ్యం, విజిలెన్స్‌, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలపై భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నామని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

శాఖల వారీగా   భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ
అధికారులతో సమీక్షిస్తున్న టీటీడీ ఈవో శ్యామలరావు

- టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి

తిరుమల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులకు టీటీడీలో అందిస్తున్న సేవలపై క్రమం తప్పకుండా అభిప్రాయ సేకరణ జరిపి, మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు భక్తుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌పై చర్చించారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు, వడ పంపిణీ, వసతి, కాలినడక భక్తులకు అందజేస్తున్న సేవలు, లగేజీ, కల్యాణకట్ట, వైద్యం, పారిశుద్ధ్యం, విజిలెన్స్‌, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలపై భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నామని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాధ్యాసాద్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అన్నప్రసాదాల పంపిణీలో ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. బియ్యం, ముడిసరుకుల నాణ్యతను పరీక్షించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగించి మరింత రుచికరమైన అన్నప్రసాదాలను అందించాలన్నారు. వసతి గృహాల్లో సకాలంలో పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా రిసెప్షన్‌, ఐటీ విభాగాలు సమన్వయంతో ఎఫ్‌ఎంఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రద్దీ సమయాల్లో లడ్డూ కౌంటర్‌ వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా పంపిణీ జరగాలన్నారు. రద్దీకి తగినట్టు సిబ్బందిని పెంచాలన్నారు. ట్రాన్స్‌పోర్టు, కల్యాణకట్టల్లోని భక్తుల వసతులపై అధిక శ్రద్ధ వహించాలన్నారు. తిరుమలలో వసతి బస్సుల సదుపాయ సమాచారాన్ని మైకుల ద్వారా ప్రకటనలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి(వర్చువల్‌), జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, సీఈ సత్యనారాయణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 02:38 AM