ఆపరేషన్ ‘స్వర్ణ’
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:47 AM
హైదరాబాదులో ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా తరహాలో ‘ఆపరేషన్ స్వర్ణ’ పేరిట స్వర్ణముఖి ప్రక్షాళన, పరిరక్షణకు ముందుకు వెళుతున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి చెప్పారు.
హైడ్రా తరహాలో ముందుకుపోతామన్న తుడా చైర్మన్
తిరుపతి, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): హైదరాబాదులో ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా తరహాలో ‘ఆపరేషన్ స్వర్ణ’ పేరిట స్వర్ణముఖి ప్రక్షాళన, పరిరక్షణకు ముందుకు వెళుతున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి చెప్పారు. తుడా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘130 కిలోమీటర్ల పొడవున్న స్వర్ణముఖి నదికి ఇరువైపులా వైసీపీ హయాంలో భారీగా భూములు కబ్జాచేసి అమ్మేశారు. వంకలు, చెరువులను తప్పుడు పత్రాలతో దోచుకున్నారు. ఈ క్రమంలో నదికి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా తరహాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. స్వర్ణముఖి బఫర్‌జోన్లలో స్థలాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రూ.40 కోట్ల తుడా నిధులతో తుమ్మలగుంటలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారని, ఆ నిధులు పూర్తిగా వ్యర్థమైనట్లు తెలిపారు. తుడాలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయి ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. మద్యం స్కాంలో తుడా వాహనాలు వినియోగించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. ‘తుడా నిధులు రూ.270 కోట్లను ఎంపీడీవో ఖాతాలకు మళ్లించి దోచుకున్నారు. తుడాలో జిరాక్స్ కాపీల నుంచి విమాన టిక్కెట్లు, వాహనాలు అంతా కుంభకోణమే. తుడాలో ఇప్పుడు పైసా కూడా లేదు. తుడా భూములను వినియోగించుకొని నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు. తాను తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లో ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. అస్తవ్యస్త ప్లానింగ్‌తో గత ప్రభుత్వం ప్రారంభించిన తుడా టవర్స్‌ను గాడిలో పెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. సూరప్పకశంలోని తుడా ప్లాట్ల రేట్లు తగ్గించి అమ్మకానికి వేలం నిర్వహిస్తున్నామన్నారు.