ఆపరేషన్ ‘రెడ్ శాండిల్’!
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:40 AM
శేషాచల అడవుల నుంచి అంతర్జాతీయ మార్కెట్ దాకా పాతుకుపోయిన నెట్‌వర్క్‌తో వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉక్కుపాదం మోపే పరిస్థితి కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది స్పష్టమైపోయింది.
యంత్రాంగంపై పెరిగిన ఒత్తిడి
ఎర్రచందనం జోలికొస్తే తాటతీస్తామంటూ హెచ్చరికలు
స్మగ్లర్లకు సహకరించొద్దంటూ స్థానికులకు పిలుపు
సెంటిమెంట్‌ను గుర్తుచేస్తూ స్మగ్లింగ్ అడ్డుకట్టలో భాగస్వాములు కావాలని శ్రీవారి భక్తులకు వినతి.
ఒక్క చెట్టూ నరక్కుండా చూడాలంటూ యంత్రాంగానికి ఆదేశాలు.
శనివారం నాటి తిరుపతి పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాటల ఉద్దేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలన్న ప్రభుత్వ వైఖరిని స్పష్టంచేసింది. ఆపరేషన్ కగార్ తరహాలో త్వరలోనే స్మగ్లర్లపై చర్యలు ఉంటాయనీ ఆయన స్పష్టం చేశారు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
శేషాచల అడవుల నుంచి అంతర్జాతీయ మార్కెట్ దాకా పాతుకుపోయిన నెట్‌వర్క్‌తో వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉక్కుపాదం మోపే పరిస్థితి కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి జారీ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది స్పష్టమైపోయింది. ఆయన తిరుపతి పర్యటన, సంబంధిత శాఖతో నిర్వహించిన సమీక్షలతో అధికార యంత్రాంగపై ఒత్తిడి పెరిగింది. పవన్ ఆహార్యం ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వ కఠిన వైఖరిని బలంగా చాటినట్టయింది. దీంతో 2014-19 నాటి టీడీపీ ప్రభుత్వ తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కఠినంగా అడ్డుకునే ప్రయత్నాలు మళ్లీ మొదలైనట్టుగా భావించాల్సి వస్తోంది. మామండూరు అటవీ ప్రాంతంలో పర్యటించిన అనంతరం తిరుపతి మంగళంలోని ఎర్రచందనం గోదామును తనిఖీ చేశారు. అక్కడి భారీ పరిమాణంలో పోగుపడిన ఎర్రచందనం దుంగలను చూసి నిశ్చేష్టులయ్యారు. ఎన్ని లక్షల చెట్లు నరికి వుంటే ఇన్ని దుంగలు పట్టుబడ్డాయంటూ తీవ్ర వేదనకు లోనయ్యారు. ఇక పట్టుబడకుండా సరిహద్దులు దాటిన దుంగల పరిమాణం తలచుకుని ఆవేదన చెందారు.
వేంకటేశ్వరస్వామి సెంటిమెంట్‌తో..
‘తిరుమలలో శ్రీవారికి గాయమైనపుడు వచ్చిన రక్తంతో ఎర్రచందనం చెట్లు పుట్టాయి. అందుకే శేషాచలంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా అవి కనిపించవు’ అన్న పవన్ వ్యాఖ్యల వెనుక.. ఎర్రచందనాన్ని వేంకటేశ్వరస్వామితో ముడిపెట్టి ఆ సెంటిమెంట్‌తో కాపాడేందుకు ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది. అందుకనే శేషాచలం అడవుల్లోని పవిత్ర ఎర్రచందనం వృక్షాలను నరకొద్దంటూ స్మగ్లర్లతో పాటు వారికి సహకరించే స్థానికులకు సైతం విజ్ఞప్తి చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ఆపరేషన్ కగార్‌ను గుర్తుచేస్తూ..
ఎర్రచందనం వృక్షాల నరికివేత కొనసాగితే ఆపరేషన్ కగార్ తరహాలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి స్మగ్లర్ల తాటతీస్తామని పవన్ హెచ్చరించారు. కూంబింగ్, నిఘా, తనిఖీలు వంటివి పటిష్టంగా చేపట్టాలని, చెట్ల నరికివేతను ఆపడానికి కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలు, చర్యలు గత టీడీపీ ప్రభుత్వ చర్యలను గుర్తుకు తెస్తున్నాయి.
గత టీడీపీ పాలనలో ఏం జరిగిందంటే..
2004-2014 నడుమ పదేళ్ల పాటు శేషాచల అడవుల్లో ఎర్రచందనం వృక్షాల నరికివేత ఇష్టారాజ్యంగా సాగింది. ఎక్కడికక్కడ అప్పటి అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు స్మగ్లర్లకు కీలకంగా సహకరించారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్ల కోసం చెట్లు నరికేందుకు స్థానికంగా కూలీలను సమకూర్చారు. స్మగ్లర్ల నుంచీ వాటాలు తీసుకుని ఆర్థికంగా బలపడ్డారు. మరికొందరు నేరుగా తామే స్మగ్లర్ల అవతారం ఎత్తారు. వారిలో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగానూ ఎన్నికయ్యారు. ఎన్నికల్లోనూ స్మగ్లర్ల డబ్బు కీలక పాత్ర పోషించింది. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం రావడంతో పరిస్థితి మొత్తం మారింది. సీఎం చంద్రబాబు కన్నెర్ర చేయడంతో పోలీసులు స్మగ్లర్లను అరెస్టు చేయడమే కాదు పీడీ యాక్టు ప్రయోగించారు. అందులో కొందరు టీడీపీ నేతలున్నా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేశారు. ఐజీ స్థాయి అధికారిని అధిపతిగా నియమించారు. సిబ్బంది సంఖ్యను పెంచి, ఆయుధాలు కూడా అందించారు. అప్పట్లో శేషాచల అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ దెబ్బకు తమిళనాడు నుంచీ కూలీలు రావడం ఆగిపోయింది. ఇపుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరు సరిగ్గా నాటి ప్రభుత్వ నిర్ణయాలను గుర్తు చేస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కూడా కఠిన వైఖరి తీసుకుంటోందనే సంకేతాలను ఇస్తోంది.
టాస్క్‌ఫోర్సు యూనిఫామ్‌లా..
రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ధరించే యూనిఫామ్‌ను పోలిన ప్యాంటు వేసుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనకు వచ్చారు. అది టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, అధికారుల్లో ఉత్తేజాన్ని నింపింది.
గుంటి మడుగు వాగులోన..
మామండూరు అటవీ గెస్ట్‌హౌస్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటి మడుగు వాగు వద్దకు అధికారులతో కలసి పవన్ వెళ్లారు. వాగు ఒడ్డున కూర్చుని, పారే నీటిలో కాళ్లను ఆడిస్తూ ఆహ్లాదంగా గడిపారు. పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకు రెండువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరాతీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్‌ఫోర్స్ అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.