‘ఆపరేషన్ గజ’ సక్సెస్
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:49 AM
యాదమరి మండల పరిధిలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి ఏనుగును తర లించేందుకు అటవీశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ సోమ వారం విజయవంతంగా ముగిసింది.
కాలు విరిగిన ఏనుగుకు కుంకీల సాయం
ఎస్వీ జూకు తరలించి వైద్య చికిత్సలు
యాదమరి/మంగళం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): యాదమరి మండల పరిధిలో కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒంటరి ఏనుగును తర లించేందుకు అటవీశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ సోమ వారం విజయవంతంగా ముగిసింది. భారీ క్రేన్ సాయంతో ఏనుగును లారీలో ఎస్వీ జూ పునరావాస కేంద్రానికి తరలించారు. తమిళనాడు రాష్ట్రం నుంచి వారం క్రితం యాదమరి మండలంలోకి ప్రవేశించిన ఈ ఒంటరి ఏనుగు రెండ్రోజుల క్రితం డీకే చెరువు సమీపం లోని కమ్మపల్లి అటవీ బీట్ గుడ్డివానిచెరువు వద్ద జారిపడడంతో కాలు దెబ్బతిని కదల్లేని స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆదివారం సీసీఎఫ్ యశోదా బాయి ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు, వైద్యులు వచ్చి పరిశీలించారు. పలమనేరు సమీపంలోని ముసలిమడుగు నుంచి కుంకీ ఏనుగులు కృష్ణ, అభిమన్యులను రప్పించి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సహాయక చర్యలు చేపట్టారు. చెరువు నుంచి కుంకీల సాయంతో ఒంటరి ఏనుగును బయటకు తీసుకొచ్చారు. అప్పటికి చీకటి పడడంతో ఆపరేషన్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. సోమవారం ఉదయం అటవీశాఖ సిబ్బంది తమ ప్రయత్నాలను పునః ప్రారంభించారు. కుంకీల సహాయంతో దెబ్బతిన్న ఏనుగును కదలకుండా చేశాక దెబ్బతిన్న ఏనుగు కాలును స్కాన్ చేశారు. అనంతరం భారీ క్రేన్‌ను ఉపయోగించి ఏనుగును క్షేమంగా లారీలోకి ఎక్కించారు. అటవీ, పోలీసుల కాన్వాయ్ సహకారంతో ఏనుగును సోమవారం మధ్యా హ్నానికి తిరుపతిలోని ఎస్వీ జూకు తీసుకొచ్చారు.ఈ తరలింపు ప్రక్రియను డీఎ్‌ఫవో శ్రీనివాసులు, రేంజర్లు థామస్, పట్టాభి తదితరులు పర్యవేక్షించారు. జూకు తీసుకువచ్చిన ఏనుగును అధికారులు అతికష్టం మీద భారీక్రేన్ సాయంతో ఏనుగుల ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. ఏనుగుకు వెనుకవైపు ఉన్న ఎడమకాలు విరిగిందని జూ అసిస్టెంట్ క్యూరేటర్ జగదీ్‌షచంద్ర ప్రసాద్ తెలిపారు. కాలుకు ఎక్స్‌రే తీసి బ్లడ్ శాంపిల్స్ సేకరించామని.... ఏనుగు ఆరోగ్యం బాగానే ఉందని కాలు విరగడం వల్ల నడవలేకపోతోందని చెప్పారు. ఇప్పటికే ఏనుగుకు ఇద్దరు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని ఆహారం కూడా తీసుకుందని వివరించారు.