Share News

కొనసాగుతున్న వాయుగుండం

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:10 AM

బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాను స్థిరంగా ఉంది.

కొనసాగుతున్న వాయుగుండం
వడమాలపేట మండలం కల్లూరు వద్ద నక్కలవాగు - ఏర్పేడు మండలం మోదుగులపాళెం వద్ద స్వర్ణముఖి నది ప్రవాహం

సూళ్లూరుపేట/తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాను స్థిరంగా ఉంది. ఇది నైరుతి దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు. ఇక, మంగళవారం తీరప్రాంతాల్లో భారీ వర్షం పడింది. తూర్పు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మొంథా తుఫానుఉతో చెరువులు నిండగా.. ఇకపై భారీ వర్షాలు కురిస్తే తెగిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాకాడులో 92.8.మి.మీ. చిట్టమూరు 87.2, తడ 80.8, దొరవారిసత్రం 64, కోట 58.2, సత్యవేడు 57, సూళ్ళూరుపేట 55, బీఎన్‌కండ్రిగ 50.6, వరదయ్యపాలెం 46.8, వడమాల పేట31.6,నాయుడుపేట 25.8, కేవీబీపురం 22.2మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 24.5మి.మీ.గా ఉంది. చిన్నగొట్టిగల్లు, బాలాయపల్లి, చంద్రగిరి, పాకాల, పిచ్చాటూరు, డక్కిలి, గూడూరులో వర్షపాతం నమోదు కాలేదు.

వడమాలపేట మండలం కల్లూరు వద్ద నక్కలవాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు ఆపేశారు.

కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద కాళంగి కాలువ ప్రవాహంతో పిచ్చాటూరు- శ్రీకాళహస్తి మధ్య రాకపోకలు ఆగాయి.

ఏర్పేడు మండలం మోదుగులపాళెం- కొత్తవీరాపురం మధ్య స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామీణులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.

పలు ప్రాంతాల్లో నదీ ప్రవాహాలు, వంతెనల వద్ద పరిస్థితిని అధికారులు పరిశీలించారు. స్థానికులను అప్రమత్తం చేశారు.

కాళంగి జలాశయం నీటిమట్టం 18.6 అడుగులకు చేరడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదిలారు.

వాకాడు వద్ద స్వర్ణముఖినది బ్యారేజీలోకి 7వేల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో 8 గేట్లను ఎత్తారు.

కోట మండలంలో దొరువుకట్ట, దైవాలదిబ్బవద్ద బలహీనంగా ఉన్న స్వర్ణముఖి నది కరకట్టలు ప్రమాదకరంగా మారాయి. శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం వద్ద సముద్రం 30 మీటర్లు ముందుకొచ్చి కోతకు గురైనట్లు మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:10 AM