Share News

రోడ్డు ప్రమాదాల్లో రోజుకొకరు బలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 01:58 AM

దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాలు సంభవించే మొదటి 100 జిల్లాల్లో చిత్తూరు కూడా ఉండడం శోచనీయం. నేషనల్‌ హైవేస్‌ అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం మన జిల్లా హై యాక్సిడెంట్‌ జోన్‌గా ఉందని మంగళవారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రకటించారు. జిల్లాలో రోజుకొకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారంటే తీవ్రత అర్థమవుతోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవైనందున రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంది. చిత్తూరు- తిరుపతి, చెన్నై- బెంగుళూరు, తిరుపతి- చెన్నై, రాణిపేట- కర్నూలు, పలమనేరు- కృష్ణగిరి వంటి జాతీయ రహదారులు జిల్లా మీదుగానే వెళ్తున్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్లూ ఎక్కువగానే ఉన్నాయి. రోడ్లన్నీ విస్తీర్ణం పెరిగి బాగుండడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డెక్కితే 80-110 కి.మీ, కారు అయితే 120-140కి.మీ స్పీడు తగ్గకుండా ప్రయాణిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో  రోజుకొకరు బలి

  • హైయాక్సిడెంట్‌ జోన్‌గా చిత్తూరు జిల్లా

  • దేశంలోని మొదటి 100జిల్లాల్లో చోటు

చిత్తూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాలు సంభవించే మొదటి 100 జిల్లాల్లో చిత్తూరు కూడా ఉండడం శోచనీయం. నేషనల్‌ హైవేస్‌ అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం మన జిల్లా హై యాక్సిడెంట్‌ జోన్‌గా ఉందని మంగళవారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రకటించారు. జిల్లాలో రోజుకొకరు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారంటే తీవ్రత అర్థమవుతోంది.

చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవైనందున రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంది. చిత్తూరు- తిరుపతి, చెన్నై- బెంగుళూరు, తిరుపతి- చెన్నై, రాణిపేట- కర్నూలు, పలమనేరు- కృష్ణగిరి వంటి జాతీయ రహదారులు జిల్లా మీదుగానే వెళ్తున్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్లూ ఎక్కువగానే ఉన్నాయి. రోడ్లన్నీ విస్తీర్ణం పెరిగి బాగుండడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డెక్కితే 80-110 కి.మీ, కారు అయితే 120-140కి.మీ స్పీడు తగ్గకుండా ప్రయాణిస్తున్నారు.

ఫ మొగిలి ఘాట్‌లో అత్యధికం

బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి ఘాట్‌ జిల్లాలో ప్రధాన ప్రమాదకర ప్రాంతంగా మారింది. 2019 నవంబరు 8న ఇక్కడ ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది సెప్టెంబరు 13న ఆర్టీసీ బస్సు ,లారీ ఢీకొని ఏడుగురు మరణించారు. ఇది సిమెంటు రోడ్డు కావడం, మలుపులు ఎక్కువగా ఉండడంతో ముందున్న వాహనాలు కనపడక ఒకదాన్ని మరొకటి ఢీ కొడుతున్నాయి. లగేజీతో చిత్తూరు వైపు వచ్చే భారీ వాహనాలు అదుపు తప్పి డివైడర్‌ దాటి అటు వైపు ప్రయాణించే వాహనాల మీదకు వెళ్లిపోతున్నాయి. ఏడుగురు మరణించాక కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చొరవ తీసుకుని డివైడర్‌ సామర్థ్యాన్ని పెంచడం వంటి నివారణ చర్యలు తీసుకున్నారు. దీంతో కొంతమేరకు ఫలితం కనిపిస్తోంది.

ఫ 25 ప్రాంతాల్లో ప్రమాదాలు..

జిల్లా రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే 25 బ్లాక్‌ స్పాట్లను అధికారులు గుర్తించారు. మొగిలి ఘాట్‌, ఎన్‌హెచ్‌-69లో దొరచెరువు, ఎన్‌హెచ్‌-42లో గొల్లపల్లె క్రాస్‌, దేవదొడ్డి, కుప్పం బైపా్‌సలోని కేసీ ఆసుపత్రి, ఎన్‌హెచ్‌-40లోని మురకంబట్టు జంక్షన్‌, ఎన్‌హెచ్‌-140లోని తాళ్లగుండ్లపల్లె క్రాస్‌, పి.కొత్తకోట అండర్‌ బ్రిడ్జి, ఎన్‌హెచ్‌- 716లోని కన్నమిట్టకు ఎదురుగా హెచ్‌పీ పెట్రోల్‌ బంకు ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వాహనాదారుల్ని అప్రమత్తం చేసేందుకు ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.

ఫ సగానికిపైగా ద్విచక్రవాహనదారులే..

గత ఏడాది 25 బ్లాక్‌ స్పాట్లలో మాత్రమే 458 ప్రమాదాలు జరిగాయి. 228 మంది మరణించగా, 510 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన 228 మందిలో 138 మంది ద్విచక్ర వాహనదారులే. ప్రస్తుత ఏడాది జూన్‌ వరకు 104మంది మరణించగా, 303 మంది గాయపడ్డారు. ఇక్కడ కూడా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు.జిల్లా మొత్తంలో చోటు చేసుకున్న ప్రమాదాలను చూసుకుంటే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. హైవేలో ప్రయాణించే వారు హెల్మెట్లను కచ్చితంగా ధరించాలనే నిబంధనను చాలామంది పాటించడం లేదు.

సంవత్సరంప్రమాదాలుమృతులు క్షతగాత్రులు

2021 735 324 805

2022 711 373 792

2023 702 351 853

2024 734 389 877

Updated Date - Jul 30 , 2025 | 01:58 AM