అమరావతి బాటలో.....
ABN , Publish Date - May 02 , 2025 | 01:17 AM
రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ వేడుకకు జిల్లానుంచి పెద్దఎత్తున ప్రజలు వెళ్లారు.అమరావతి అభివృద్ధికి ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతరాయం ఏర్పడినా... విజనరీ చంద్రబాబు కృషితో మళ్లీ పనులు వేగవంతమవు తున్నాయి.
పునర్నిర్మాణ పనుల ప్రారంభ వేడుకకు జిల్లానుంచి పెద్దఎత్తున తరలిన ప్రజలు
ప్రభుత్వం తరఫున 30 బస్సుల ఏర్పాటు
మరో 13 బస్సుల్లో, 300 కార్లలో నేతలు
చిత్తూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ వేడుకకు జిల్లానుంచి పెద్దఎత్తున ప్రజలు వెళ్లారు.అమరావతి అభివృద్ధికి ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతరాయం ఏర్పడినా... విజనరీ చంద్రబాబు కృషితో మళ్లీ పనులు వేగవంతమవు తున్నాయి. శుక్రవారం ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జిల్లా ప్రజలూ బయల్దేరారు.ప్రభుత్వం తరఫున కుప్పం మినహా 6 నియోజకవర్గాల నుంచి 5 చొప్పున మొత్తం 30 బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సుకు ఒక్కో వీఆర్వోను ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయా బస్సుల్లో ప్రయాణించేవారి వివరాలన్నీ వీఆర్వోలు నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు అందిస్తారు.గురువారం రాత్రి, శుక్రవారం మూడు పూట్లా భోజనాల ఖర్చులకు ఒక్కో బస్సుకు రూ.20 వేల చొప్పున కలెక్టర్ సుమిత్‌కుమార్ అందించారు.జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి గురువారం రాత్రి 8 గంటలకు బస్సులు బయల్దేరగా.. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు అమరావతికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సుమారు 1500 మంది శుక్రవారం ఉదయం బస్సు దిగగానే వారికి అవసరమైన సౌకర్యాలు కూడా అధికారుల బృందమే చూసుకుంటుంది. ఒక్కో మండలం నుంచి ఒక్కో బస్సు బయల్దేరుతుండగా.. మళ్లీ బస్సులు వచ్చే వరకు ఆయా తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు.ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన బస్సులే కాకుండా టీడీపీ నాయకులు కూడా తమ సొంత నిధులతో వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా 13 బస్సుల్లో, 300 కార్లలో అమరావతి సభకు వెళ్లినట్లు అంచనా. ప్రభుత్వం తరఫున 1500 మంది కాకుండా పార్టీ తరఫున మరో 2 వేల మందికిపైగా వెళ్లినట్లు సమాచారం.