Share News

అయ్యో.. ఎంత బాధొచ్చిందో!

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:14 AM

వాళ్లకు ఎంత బాధొచ్చిందో.. ఏమో! ఇద్దరు చెట్టుకు ఉరేసుకున్నారు. అక్కడి పరిస్థితులను బట్టి మరో ఇద్దరు పిల్లలను పూడ్చివేసినట్లు అనుమానిస్తున్నారు. వారం కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

అయ్యో.. ఎంత బాధొచ్చిందో!
దంపతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం

పాకాలవారిపల్లె అటవీప్రాంతంలో రెండు మృతదేహాలు

దంపతులుగా భావిస్తున్న పోలీసులు

మరో ఇద్దరు పిల్లలను పూడ్చివేసినట్లు అనుమానం

చంద్రగిరి, పాకాల, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): వాళ్లకు ఎంత బాధొచ్చిందో.. ఏమో! ఇద్దరు చెట్టుకు ఉరేసుకున్నారు. అక్కడి పరిస్థితులను బట్టి మరో ఇద్దరు పిల్లలను పూడ్చివేసినట్లు అనుమానిస్తున్నారు. వారం కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. చంద్రగిరి మండలం పాకాలవారిపల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలోని మూలకోన అటవీప్రాంతంలో ఆదివారం సాయంత్రం గొర్రెల కాపరులకు దుర్వాసన రావడంతో మృతదేహాలున్న విషయం బయటపడింది. అటవీశాఖ, పాకాల సీఐ సుదర్శన్‌, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. సంఘటనా స్థలంలో మద్యం, కూల్‌డ్రింక్‌ బాటిళ్లు, మాత్రలు, సెల్‌ఫోన్‌ చార్జర్‌, చిన్న పిల్లల దుస్తులున్నాయి. అక్కడే రెండు గోతులు తీసి, ఎత్తుగా మట్టి కప్పి ఉండటం, ఆగోతులపై రెండు వరుసల రాళ్లు ఉండటంతో ఇద్దరు పిల్లలను పూడ్చి వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లు వెళ్లేసరికే సాయంత్రం 6 గంటలు కావడంతో మృతదేహాలను పరిశీలించి వచ్చేశారు. ఈ అటవీ ప్రాంతంపై అవగాహన ఉన్న వాళ్ళే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, లేదా ఇతర సమస్యలు కారణంగానే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉందని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతం పరిధి చంద్రగిరా లేదా పాకాల మండలమా అని పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. అటవీ ప్రాంతం పరిధి మాత్రం పాకాల మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుందని చంద్రగిరి పోలీసులు అంటే, పాకాలవారిపల్లె చంద్రగిరి మండలంలో ఉందని పాకాల పోలీసులు అంటున్నారు. సోమవారం ఉదయం మృతదేహాలను పరిశీలించి, గోతులు తవ్వి దర్యాప్తు చేపట్టనున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 01:14 AM