Share News

ఆఫీసర్‌ వర్సెస్‌ అటెండర్‌

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:17 AM

రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో వివాదం పోలీస్‌ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు

ఆఫీసర్‌ వర్సెస్‌ అటెండర్‌
సబ్‌ రిజిస్ట్రార్‌తో మాట్లాడుతున్న అటెండర్‌ తిరుమలేశ్‌, దళిత సంఘం నాయకులు.

రేణిగుంట జూలై 21(ఆంధ్రజ్యోతి): జిల్లా అధికారి ఇచ్చిన ఉత్తర్వు మేరకు అటెండర్‌ను విధుల్లోకి తీసుకోకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ తిరస్కరించడంతో చెలరేగిన వివాదం పోలీస్‌ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదుల వరకు దారితీసింది. రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఎన్‌.తిరుమలేశ్‌ను ఫిబ్రవరి నెలలో ఓ విచారణ నిమిత్తం డిప్యుటేషన్‌పై సత్యవేడుకు పంపారు. తనను డిప్యుటేషన్‌పై పంపడం సరికాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రేణిగుంటలోనే కొనసాగించమంటూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు జిల్లా రిజిస్ట్రార్‌ రేణిగుంటలోనే పనిచేయాల్సిందిగా తిరుమలేశ్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. విధుల్లో చేరేందుకు గత సోమవారం రేణిగుంట కార్యాలయానికి వెళ్లడంతో ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆనంద్‌ రెడ్డి అంగీకరించలేదు. రోజూ కార్యాలయానికి వెళుతున్నా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయనీకపోవడంతో తిరుమలేశ్‌ సోమవారం ఎమ్మార్పీఎస్‌ నేతలతో కలసి ఎస్‌ఆర్‌ కార్యాలయానికి వెళ్లారు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.పరస్పరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ విషయంపై దళిత సంఘం నాయకుడు గోపి మీడియాతో మాట్లాడుతూ అటెండరు దళితుడని లెక్కనేనితనంతో ఆనంద్‌ రెడ్డి వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.‘నిన్ను పనిలో పెట్టుకోను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అవమానించారని ఈ విషయంపై సబ్‌ రిజిస్ర్టార్‌ ఆనంద్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ ఆనంద రెడ్డి మాట్లాడుతూ అటెండర్‌ ప్రవర్తన సరిగ్గా లేని అటెండర్‌ తిరుమలేశును విధుల్లో చేర్చుకోనని ఇదివరకే జిల్లా రిజిస్ర్టార్‌కు తెలిపానన్నారు. అయితే కొంతమంది దళిత సంఘ నాయకులను తీసుకువచ్చి తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.కాగా ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో కేసులు నమోదు చేస్తే ఇబ్బందని పోలీసులు చెప్పడంతో ఇరువర్గాలూ వెనకడుగు వేసినట్టు సమాచారం. తర్వాత అక్కడ నుంచి జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీరామ్‌కుమార్‌ వద్దకు పంచాయితీ మారినట్టు తెలిసింది. చివరకు వారిద్దరూ రాజీపడి ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. అటెండర్‌ను విధుల్లోకి తీసుకునేందుకు సబ్‌ రిజిస్ర్టార్‌ అంగీకరించినట్లు తెలిసింది.

Updated Date - Jul 22 , 2025 | 01:17 AM