మరో 13 ఆలయాల ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటుకు నోటిఫికేషన్
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:45 AM
తిరుపతి జిల్లాలో మరో 13 ఆలయాలకు పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ధార్మిక పరిషత్ నోటిఫికేషన్ జారీచేసింది.
తిరుపతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 13 ఆలయాలకు పాలకమండళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ధార్మిక పరిషత్ నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటికే వార్షికాదాయం రూ.కోటి నుంచి రూ. 5కోట్ల వరకున్న నాలుగు ప్రధాన ఆలయాలకు గురువారం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రగిరి మూలస్థానం ఎల్లమ్మ, తొండవాడ అగస్తీశ్వరస్వామి, పాకాల మండలం ఊట్లవారిపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, తలకోనలోని సిద్దేశ్వరస్వామి, వెంకటగిరి పోతురాజు పోలేరమ్మ ఆలయం, డక్కిలి మండలం దేవుడి వెల్లంపల్లిలోని స్తంభాలగిరి ఈశ్వరయ్యస్వామి, గూడూరు ధర్మరాజస్వామి ఆలయం, చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వాకాడు మండలం పంట్రంగంలోని పాండురంగేశ్వరస్వామి, ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామి, నారాయణవనం మండలం కైలాసనాథస్వామి, నాయుడుపేట మండలం విన్నమాలలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, తిరుపతికి సంబంధించి వేశాలమ్మ ఆలయాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆసక్తి కలిగిన వారు 20రోజుల్లోగా తమ దరఖాస్తులను జిల్లా దేవదాయశాఖ అధికారి ద్వారా పంపించాలి.