థియేటర్లలో లోటుపాట్లపై నోటీసులు
ABN , Publish Date - May 31 , 2025 | 01:50 AM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సినిమా థియేటర్లలో రెవిన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, అగ్నిమాపక శాఖలు బుధవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.థియేటర్లకు వెళ్ళి అక్కడి పరిస్థితులు, సౌకర్యాలను పరిశీలించి పాప్‌కార్న్, పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్, స్వీట్‌కార్న్, సమోసా, పఫ్ వంటి తినుబండారాల ధరలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
చిత్తూరు కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సినిమా థియేటర్లలో రెవిన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, అగ్నిమాపక శాఖలు బుధవారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.థియేటర్లకు వెళ్ళి అక్కడి పరిస్థితులు, సౌకర్యాలను పరిశీలించి పాప్‌కార్న్, పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్, స్వీట్‌కార్న్, సమోసా, పఫ్ వంటి తినుబండారాల ధరలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే మరుగుదొడ్ల నిర్వహణ, థియేటర్లలో సీట్ల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు కూడా గుర్తించారు.ప్రతి థియేటర్‌లో అధికంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తేలింది. బి-ఫారం లైసెన్సు రెన్యువల్, అగ్నిమాపక, మున్సిపాలిటీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖలు ఇచ్చే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లకు గడువుందా? ముగిసిందా? ముగిసివుంటే వాటి రెన్యువల్స్ కోసం థియేటర్ యాజమాన్యాలు సంబంధిత శాఖలకు గతంలోనే దరఖాస్తు చేసుకున్నారా? లేదా? బి-ఫారం లేకుండానే థియేటర్లు నిర్వహిస్తున్నారా? అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు (ఫైర్ సేఫ్టీ) వున్నాయా అనే విషయాలను తనిఖీల్లో గుర్తించారు. జిల్లా యంత్రాంగం ఇచ్చిన ప్రొఫార్మాలో ఆయా తహసీల్దార్లు తనిఖీల్లో గుర్తించిన లోటుపాట్లను నివేదిక రూపంలో ఆర్డీవోలకు అందజేశారు. ఆర్డీవోల నుండి కలెక్టరేట్‌కు శుక్రవారం నివేదికలు అందాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్ యాజమాన్యాలకు శుక్రవారం కలెక్టరేట్ అధికార వర్గాలు షోకాజ్ నోటీసులు జారీచేశాయి. మూడ్రోజుల లోగా సమాధానాలు ఇవ్వాలని అందులో సూచించారు. సోమవారంలోగా సమాధానాలు అందిన తరువాత వాటిపై జేసీ విద్యాధరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.