Share News

పనులు చేయడమేకాదు.. సానుకూలత సాధించాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 02:20 AM

గుడ్‌విల్‌ మస్ట్‌. ఎన్ని పనులు చేసినా, ప్రజా సానుకూలత సాధించాలి. అది లేకపోతే మనం ఫెయిల్‌ అయినట్లే.’ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకు చేసిన దిశానిర్దేశం ఇది.

  పనులు చేయడమేకాదు.. సానుకూలత సాధించాలి

కుప్పం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘గుడ్‌విల్‌ మస్ట్‌. ఎన్ని పనులు చేసినా, ప్రజా సానుకూలత సాధించాలి. అది లేకపోతే మనం ఫెయిల్‌ అయినట్లే.’ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకు చేసిన దిశానిర్దేశం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 2.45 గంటలనుంచి దాదాపు సాయంత్రం నాలుగు గంటలదాకా సుమారు గంటా గంటంపావు సమయం కుప్పం నియోజకవర్గ పార్టీ నాయకులు, జిల్లా, కడా అధికారులతో జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. అభివృద్ధి జరుగుతున్న తీరుతోపాటు, జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకున్నారు. అభివృద్ధి చేయడమే కాదు, చేసిన పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ఎంత ముఖ్యమో నొక్కి చెప్పారు. కుప్పం నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం ఎంత అవసరమో చెప్పారు. అయితే ఈ విషయంలో ‘స్మూత్‌గా ఆపరేట్‌ చేయాల’న్నారు. కేవలం అధికారులో, నాయకులో ఏకపక్షంగా కాకుండా రెండు వర్గాలూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అందుకే తాను పదేపదే పొలిటికల్‌ గవర్నెన్స్‌ అని చెబుతుంటానన్నారు. ‘పార్టీ, ప్రభుత్వం రెండూ ముఖ్యమే’ అని స్పష్టం చేశారు. పనులు రొటీన్‌గా చేసుకుని వెళ్లకుండా ఆ చేస్తున్న పనులు పబ్లిక్‌కు ఎంతవరకు అర్థమవుతోంది, ఏం చేస్తున్నాం.. అనేది చూసుకుంటూ ఉండాలన్నారు. గతంలో ఇలా జరగనందువల్లే ఫెయిల్‌ అయ్యామన్నారు. ‘ముందు నేను స్ట్రెయిట్‌ ఫార్వార్డ్‌గా వెళ్లాను. నేను పరిగెత్తాను. మిగిలినవాళ్లు రాలేదు. చేసింది ప్రజల్లోకి పోలేదు.’ అని గుర్తు చేసుకున్నారు. ‘ఇన్ని పనులు చేశాక నెంబర్‌ వన్‌గా ఉండాలి. అది అప్పుడు మిస్పింగ్‌.’ అన్నారు. ఎన్ని చేసినా గుడ్‌విల్‌ లేకపోతే ఓట్ల విషయంలో గ్యాప్‌ వస్తుందన్నారు. కొన్నిసార్లు తాను చేసిన పనుల విషయంలో ప్రజలనుంచి గుడ్‌విల్‌ పొందగలిగినా నాయకులు చెడగొట్టి గ్యాప్‌ తీసుకువచ్చారని ఆవేదన చెందారు. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కాలమైందని, ఇప్పటిదాకా చాలా పనులు చేశామని గుర్తు చేశారు. ‘ప్రతిరోజూ మీమీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల డేటా తీసుకోండి. మూడు నెలలకోసారి ఆయా పనులపై సమీక్షించుకోండి.’ అని సూచించారు. ఇటీవల ఆంధ్రా ముఖ్యమంత్రి గురించి, ఉపముఖ్యమంత్రి గురించి చేసిన పాజిటివ్‌ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇంకా కొన్ని పనులు చేయాలని, కొన్నిచోట్ల చేసేది ప్రజలకు చేరాలని అన్నారు. ‘ప్రజల అంచనాల ప్రకారం చేయడం ఒకయెత్తు, ఆ చేసిన పనులు వాళ్లకి చేరడం ఒకయెత్తు.’ అన్నారు. ఏది చేసినా పబ్లిక్‌ ఒపీనియన్‌ పాజిటివ్‌గా రావాలన్నారు. గతంలో కేంద్రంతో మాట్లాడి జనంకోసం పనికి ఆహార పథకం అమలు చేశాం. ఏకంగా 84 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తెచ్చాం. తీవ్రమైన కరువులో ఆ పథకం ద్వారా జనాన్ని ఆదుకున్నాం. అయితే పార్టీవాళ్లకోస బియ్యం తీసుకొచ్చారు, మనకోసం కాదన్న విధంగా జనంలోకి నెగిటివ్‌ టాక్‌ వెళ్లింది.’ అని గుర్తు చేశారు. ఈసారి అలా జగరకుండా చూడాలని, చేసిన ప్రతి పని విషయలో పబ్లిక్‌ ఒపీనియన్‌ కచ్చితంగా పాజిటివ్‌గా రావాలని ఆదేశించారు. అసంతృప్తి ఎక్కడుందో, సంతృప్తి ఎక్కడుందో తెలుసుకోవాలన్నారు. ‘అందరికీ కోరికలు ఉంటాయి. కానీ జినైన్‌గా ముందుకు పోతే ఓకే. పనిచేశాను. పదవి ఇవ్వమని అందరూ అడిగితే ఎలా? పదవులు పరిమితం.’ అని పదవుల విషయంలో నాయకుల్లో అంతర్లీనంగా అసంతృప్తిని తగ్గించడానికి ప్రయత్నించారు. జిల్లా కలెక్డర్‌, కడా పీడీలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ సెల్స్‌, జన నాయకుడు పోర్టల్‌ ద్వారా ప్రజలనుంచి అందుతున్న ప్రజా సమస్యల పరిష్కారం కచ్చితంగా చేయాలని ఆదేశించారు. వాటిలో వారేం కోరుకుంటున్నారో సమీక్షించి, వీలైన వాటన్నింటినీ తీర్చాలని, లేనిపక్షంలో ఎందుకు వీలుకాదో వివరంగా, అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇంకా పలు అంశాలపై ఆయన అధికారులకు, టీడీపీలోని ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ జూమ్‌ మీటింగులో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు, ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు పాల్గొన్నారు.

-------------------------------------------------

Updated Date - Dec 14 , 2025 | 02:20 AM