Share News

కొన్ని చోట్ల సహాయ నిరాకరణ

ABN , Publish Date - Oct 02 , 2025 | 01:46 AM

తమ నిరసనలో భాగంగా కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు బుధవారం పింఛన్ల పంపిణీకి సహాయ నిరాకరణ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా వీరు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీవీడబ్ల్యూఎ్‌సఈ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కొన్ని చోట్ల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పింఛన్లను పంపిణీ చేయలేదు.

కొన్ని చోట్ల సహాయ నిరాకరణ
శ్రీనివాసపురంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

సచివాలయాలకు వచ్చిన పెన్షన్‌దారులు

మరికొన్ని చోట్ల ఆలస్యంగా పంపిణీ

2,49,344 మందికి పింఛన్ల అందజేత

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): తమ నిరసనలో భాగంగా కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు బుధవారం పింఛన్ల పంపిణీకి సహాయ నిరాకరణ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా వీరు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీవీడబ్ల్యూఎ్‌సఈ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కొన్ని చోట్ల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పింఛన్లను పంపిణీ చేయలేదు. ఉదయం పది గంటలైనా ఉద్యోగులు రాకపోవడంతో పింఛనుదారులు కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలకు వెళ్లారు. అక్కడే వీరికి పింఛన్లు అందజేశారు. దీనిపై పుత్తూరు పట్టణం ఆరేటమ్మ కాలనీ పరిధిలోని సచివాలయ సిబ్బందిపై టీడీపీ నేత గాలి జీవరత్నం నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పెన్షన్‌ పంపిణీ చేయమని చెబితే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేవారు కదా. లబ్ధిదారులను కార్యాలయాలకు పిలిపించి ఇబ్బందులకు ఎలా గురిచేస్తారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఆయన మండిపడ్డారు. అత్యధిక ప్రాంతాల్లో ఉద్యోగులు ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించారు. ఇక, వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు, నాయుడుపేట, పుత్తూరు మున్సిపాలిటీల్లో ఉదయం 10గంటల తర్వాత పింఛన్లు పంపిణీ చేశారు. చాలాచోట్ల నల్లబ్యాడ్జీలు ధరించి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ తమకు అప్పగించొద్దంటూ అధికారులకు వినతిపత్రాలను అందించారు. తిరుపతి కార్పొరేషన్‌లోని కొందరు సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ సందర్భంగా ఇంటింటిసర్వే నుంచి విముక్తి కల్పించండంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. మొత్తమ్మీద జిల్లాలో 2,62,995 మందికి గాను బుధవారం రాత్రి 7 గంటల వరకు 2,49,344 మందికి (94.81 శాతం) పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం దక్కింది. తిరుపతి రూరల్‌ శ్రీనివాసపురం పంచాయతీలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 01:46 AM