Share News

గజదాడులతో ఇంకెవరి ప్రాణాలూ పోకూడదు

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:25 AM

మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న గ్రామస్తులు డీఎ్‌ఫవో హామీతో రామకృష్ణమరాజు మృతదేహం పీఎంకు తరలింపు

గజదాడులతో ఇంకెవరి ప్రాణాలూ పోకూడదు

సోమల/పుంగనూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గజదాడులతో ఇంకెవరి ప్రాణాలు పోకుండా రక్షణ కల్పించి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని చిత్తూరు డీఎ్‌ఫవో ఎస్‌.భరణిని పలువురు గ్రామస్తులు కోరారు. శనివారం రాత్రి సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన సి.శ్రీరామరాజు కుమారుడు సి.రామకృష్ణమరాజు(46)ను పొలం వద్ద 16 ఏనుగుల గుంపు దాడి చేసి.. తొక్కి చంపేసిన విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామకృష్ణమరాజును ఏనుగులు తొక్కి చంపాయని ఆరోపిస్తూ మృతదేహాన్ని శవపరీక్షకు తరలించకుండా గ్రామస్తులు ఆదివారం ఉదయం వరకు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న డీఎ్‌ఫవో భరణి.. ఫారెస్టు, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి గ్రామస్తులు, బాధిత కుటుంబీకులతో చర్చించారు. ఈసందర్భంగా రైతులు ఆమెతో మాట్లాడుతూ.. పదేళ్లుగా ఏనుగుల గుంపుతో పంటలు నష్టంతోపాటు రైతులు, పశువుల కాపర్లు ప్రాణాలు కోల్పోతున్నారని, తమకు ఏనుగుల బెడద ఎప్పుడు తీరుతుందని ప్రశ్నించారు. మూడ్రోజులుగా రాంపల్లె బీట్‌, కొత్తూరు, పట్రపల్లె ప్రాంత ంలో 16 ఏనుగుల గుంపు తిష్ఠ వేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు స్థానికులు వివరించారు. ఏనుగుల దాడులతో టమోటా, మామిడి, వరి పంటలు కోల్పోతున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం అందించే నష్ట పరిహారం తక్కువన్నారు. ఇకనైనా ఏనుగుల బారి నుంచి రక్షణ కల్పిస్తూ.. అటవీ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఇక రామకృష్ణమరాజు కుటుంబం పెద్దదిక్కును కోల్పోయుందని, భార్య రాధిక, కుమార్తెలు గాయుత్రీ, నిఖిత, కుమారుడు గణేశ్‌ దిక్కులేని వారయ్యారన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీ-4 పథకం ద్వారా మృతుడి కుటుబాన్ని అన్నిరకాలుగా ఆదుకోవాలని విన్నవించారు. కుటుంబీకులు, గ్రామస్తుల చెప్పిన విషయాలను కలెక్టర్‌, అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని డీఎ్‌ఫవో హామీ ఇవ్వడంతో రామకృష్ణమరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం (పీఎం)కు తీసుకెళ్లడానికి అంగీకరించారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పీఎం అయ్యాక రామకృష్ణమరాజు అంత్యక్రియలు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగాయి.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎ్‌ఫవో

రామకృష్ణమరాజు మృతి చెందిన స్థలానికి డీఎ్‌ఫవో భరణి వెళ్లి పరిశీలించారు. ఏనుగులు దాడులు చేస్తున్న తీరు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. రైతులతోనూ మాట్లాడారు. ఏనుగుల గుంపు సంచరించే అటవీ ప్రాంతాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని, గ్రామాల్లో ఫారెస్టు అధికారులు, సిబ్బంది ఫోన్‌ నెంబర్లు బ్యానర్లు ఏర్పాటు చేస్తామని, ఏనుగులు తరిమేందుకు ఫారెస్టు సిబ్బందిలేకుండా ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. ఏనుగుల గుంపును తరలించేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు తీసుకురావడం, ఏనుగులు రాకుండా భయపడేందుకు లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆమెవెంట పలమనేరు సబ్‌ డీఎ్‌ఫవో వేణుగోపాల్‌, పుంగనూరు రేంజర్‌ శ్రీరాములు, ఎఫ్‌ఎ్‌సవో ఇంద్రాణి, ఎస్‌ఐ శివశంకర అటవీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పంటలపై కొనసాగిన గజదాడులు

సోమల మండలం ఆవులపల్లె పంచాయతీలో శనివారం రాత్రి పంటలపై గజదాడులు కొనసాగాయి. కొబ్బరి, వరి, మామిడి తోటల్లో తిరగాడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. నెల రోజులుగా పులిచెర్ల మండలం వైపు వెళ్లిన ఏనుగులు మళ్లీ మండలంలో ప్రవేశించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. రాంపల్లె బీట్‌, ఇర్లపల్లె సమీపంలో సంచరించడంతో అటవీ అధికారులు రైతులకు సూచనలు చేశారు. సాయంత్రం వేళ పొలాల వైపు రైతులు వెళ్లరాదని, అప్రమత్తంగా ఉండాలన్నారు.

బీట్‌ ఆఫీసర్‌పై మండిపడ్డ కొత్తూరు గ్రామస్తులు

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చెక్కును అందజేయడానికి అటవీ అధికారులు కొత్తూరు గ్రామానికి వచ్చిన సందర్భంలో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న బీట్‌ ఆఫీసర్‌ షాజహాన్‌ తీరుపై స్థానికులు మండిపడ్డారు. బీట్‌ ఆఫీసర్‌ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెదురును అక్రమ రవాణాకు సహకరిస్తూ.. మామూళ్లు తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహిస్తున్నాడని ఆరోపించారు. వెంటనే ఆయన్ను బదిలీ చేయాలని పుంగనూరు రేంజి ఆఫీసర్‌ శ్రీరాములుకు ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - Jul 28 , 2025 | 01:25 AM