జీఎస్టీ స్కాంపై విచారణ ఏదీ..?
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:33 AM
చిత్తూరులో సంచలనం రేపిన జీఎస్టీ స్కాంపై అధికారులు స్పందించడం లేదు. ఒక నెల జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటేనే జరిమానాలు, చర్యలు తీసుకుంటున్న జీఎస్టీ అధికారులు ఏకంగా రూ.389 కోట్ల మేర స్కాం జరిగితే చలనం లేదు.
దర్జాగా తిరుగుతున్న అక్రమార్కులు
చిత్తూరు రూరల్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులో సంచలనం రేపిన జీఎస్టీ స్కాంపై అధికారులు స్పందించడం లేదు. ఒక నెల జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటేనే జరిమానాలు, చర్యలు తీసుకుంటున్న జీఎస్టీ అధికారులు ఏకంగా రూ.389 కోట్ల మేర స్కాం జరిగితే చలనం లేదు. మరోవైపు ఇరుక్కుపోయిన అమాయకులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలా బయటపడాలో తెలియక మదనపడిపోతున్నారు. ఇప్పటికే ఈ స్కాంలో మోసపోయిన వారి సంఖ్య వందకుపైగా చేరిందని తెలుస్తోంది. వీధి వ్యాపారులు, నిరుపేదల ఖాతాలను, ఆధార్‌ను ఉపయోగించి సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఏ ఒక్క అధికారి స్కామర్లపై చర్యలు కాదు కదా.. కనీసం విచారణ కూడా మొదలు పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎస్పీకి ఫిర్యాదు..
జీఎస్టీ స్కాంలో మోసపోయిందంతా నిరుపేదలు, అమాయకులే. డబ్బుకు ఆశపడి కొందకు మోసపోతే, వారికి తెలియకుండానే మరికొందరు మోసపోయారు. నగరంలోనే వంద ఫర్మ్‌లకుపైగా జీఎస్టీ చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. అయితే ఇందులో ఒకరిద్దరికి మాత్రమే నోటీసులు అందాయని, మిగిలిన వారి నోటీసులను స్కామరే తీసుకున్నాడని సమాచారం. నోటీసులు తీసుకున్నవారు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించడంతో వారెవరూ ముందుకు రావడం లేదు. అయితే చిత్తూరులోని పెద్దహరిజనవాడకు చెందిన విజయ చక్రవర్తి(చక్రి) అనే ఒక్క బాధితుడు మాత్రమే ధైర్యంగా బయటకు వచ్చి మీడియాకు, ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.అంతేకాకుండా ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఫిర్యాదు చేశాడు.
ఇంటి దొంగలున్నారన్న అనుమానాలు
జీఎస్టీ స్కాంపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్నా దీనిపై జీఎస్టీ అధికారులు విచారణకు ఆదేశించపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ స్కాం వెనుక ఇంటి దొంగలు ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి. అధికారుల అండలేకుండా ఇంతపెద్ద స్కాం చేయలేరని విశ్రాంత అధికారులు చెబుతున్నారు.
తాజాగా 7 ఫర్మ్‌ల రద్దు?
జీఎస్టీ ఎగ్గొడుతున్న ఏడు ఫర్మ్‌లను జీఎస్టీ అధికారులు గుర్తించి తాజాగా రద్దు చేసినట్లు సమాచారం. వీటిల్లో.. హరి ఓం ట్రేడర్స్, హేమ స్టీల్స్, సంతోష్ కాంట్రాక్ట్ వర్క్స్, సాయిక్రిష్ణ కాంట్రాక్టు వర్క్స్, అభి ఎంటర్‌ప్రైజస్, హేమచంద్ర కాంట్రాక్టు వర్క్స్, పెద్ద మస్తాన్ ఎంటర్‌ప్రైజస్ ఉన్నాయని తెలిసింది.