నిండ్ర ఎంపీపీ రాజీనామా
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:14 AM
నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు దీప తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం రాజీనామా పత్రాన్ని జడ్పీసీఈవో రవికుమార్ నాయుడికి అందజేశారు.
నిండ్ర, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నిండ్ర మండల పరిషత్ అధ్యక్షురాలు దీప తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం రాజీనామా పత్రాన్ని జడ్పీసీఈవో రవికుమార్ నాయుడికి అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాల్లో ఏడింటిని వైసీపీ కైవసం చేసుకుంది.కావనూరులో టీడీపీ గెలిచింది.వైసీపీ సీనియర్ నేత చక్రపాణిరెడ్డి సోదరుడు కొప్పేడు ఎంపీటీసీ భాస్కర రెడ్డి ఎంపీపీగా ఎన్నిక అవుతారని జోరుగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా కావనూరు ఎంపీటీసీ కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిపోయారు. ఎంపీపీ కావడానికి కావలసినంత మెజారిటీ భాస్కర రెడ్డికి ఉండగా ఎమ్మెల్యే రోజా తెరపైకి ఎలకాటూరు ఎంపీటీసీ దీప పేరును తీసుకొచ్చారు.భాస్కర్‌రెడ్డి ఎంపీపీ కావాలని చక్రపాణిరెడ్డి వర్గీయులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా చివరకు దీప ఎంపీపీగా ఎన్నికైంది. అప్పటి నుంచి చక్రపాణిరెడ్డి వర్గీయులు వైసీపీకి దూరంగా ఉంటూ ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీపీని పదవి నుంచి దించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.ఈ నేపథ్యంలో శనివారం వారంతా తమ వర్గానికి మద్దతిచ్చే ఎంపీటీసీల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన పత్రాన్ని నగరి ఆర్డీవోతో పాటు కలెక్టర్‌కు అందజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ దీప రాజీ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి.ఈ నేపథ్యంలో సోమవారం నేరుగా జడ్పీ సీఈవో రవినాయుడిని కలసిన దీప తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.మిగిలిన ఏడాది కాలంలో నిండ్ర ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.