Share News

అపోలో వర్సిటీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:25 PM

అపోలో యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటనలపై బుధవారం నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యురాలు విజయ భారతి విచారణ చేపట్టారు

 అపోలో వర్సిటీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ
యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడుతున్న విజయభారతి

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): చిత్తూరు శివారు ప్రాంతంలోని మురకంబట్టు వద్ద ఉన్న అపోలో యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటనలపై బుధవారం నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యురాలు విజయ భారతి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె పోలీసు అధికారులతో కేసులపై విచారించారు. అనంతరం జరిగిన సంఘటనలపై విద్యార్థులను ఆరా తీశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... యూనివర్సిటీలో ఇటీవల జరిగిన లేడీస్‌ బాత్‌ రూంలో హిడెన్‌ కెమెరా, హాస్టల్‌ మెస్‌లో ఫుడ్‌ పాయిజన్‌ లాంటి ఘటనలపై మీడియాలో కథనాలు చూసి విచారించడానికి వచ్చినట్లు తెలిపారు. హిడెన్‌ కెమెరాకు సంబంధించి కేసు పోలీసుల విచారణలో వున్నందున పూర్తి వివరాలు వెలువరించలేమన్నారు. అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేయగా... ప్రస్తుతం బెయిల్‌ వచ్చినట్లు తెలిపారు. విచారణను వేగవంతం చేసి దోషులను తొందరగా న్యాయస్థానం ముందు హాజరుపరచాలని పోలీసులను కోరామన్నారు. విద్యార్థులతో మాట్లాడామని, వారందరూ సమస్యలేమీ లేవని చెప్పారన్నారు. యూనివర్సిటీ యాజమాన్యంతో పాటు అధ్యాపకులతో సమీక్షించి సూచనలు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ వినోద్‌ భట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నరే్‌షకుమార్‌ రెడ్డి, డీఎస్పీ సాయినాథ్‌, సీఐ నిత్యాబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:25 PM