Share News

కొత్త సాంకేతిక సవాళ్లే అజెండా

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:12 AM

కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళల సాధికారత’ అంశాన్ని అజెండాగా తీసుకుని తిరుపతిలో ఆది, సోమవారాల్లో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది

కొత్త సాంకేతిక సవాళ్లే అజెండా
రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 12(ఆంద్రజ్యోతి): ‘కొత్త సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళల సాధికారత’ అంశాన్ని అజెండాగా తీసుకుని తిరుపతిలో ఆది, సోమవారాల్లో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరగనుంది. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా నేతృత్వంలో జరిగే ఈ సదస్సుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సులో ‘వికసిత్‌భారత్‌ కోసం మహిళల అభివృద్ధి, జెండర్‌ రెస్పాన్సివ్‌ బడ్జెటింగ్‌’ అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే భారత్‌ డిజిటల్‌ మార్పు, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చెయిన్‌, రోబోటిక్స్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాలపై చర్చ జరగనుంది. స్టెమ్‌మహిళల ప్రాతినిథ్యం పెంచడం, డిజిటల్‌ భద్రత, వ్యవసాయ రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెంచడంపైనా చర్చించనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనలో కొత్త సాతికేతల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో మహిళల చేర్పు వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఈ సదస్సుకు పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల నుంచీ దాదాపు 250 మంది మహిళా ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. కాగా, సదస్సు జరిగే రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఇతర అధికారులు పరిశీలించారు. కన్వెన్షన్‌ సెంటర్‌లో సీటింగ్‌, వేదిక ఏర్పాట్లు క్రమపద్ధతిలో ఉండేలా చూడాలన్నారు.

వేదికపైన వీరే

‘లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ కమిటీ చైర్‌పర్సన్‌ పురంధేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్‌ గౌరు చరితారెడ్డి. ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారు. 15న జరిగే ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరవుతారు’ అని శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ మీడియాకు తెలిపారు.

సంప్రదాయ దుస్తుల్లో హాజరు కండి

రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సుకు సంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వర్తించాలని అధికారులకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ దిశానిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం విధులు కేటాయించిన నోడల్‌, లైజన్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నట్లు చెప్పారు. నోడల్‌ అధికారులే కాకుండా ప్రతి రాష్ట్రానికి సూపర్‌వైజింగ్‌ నోడల్‌ అధికారులను నియమించామన్నారు. అతిథులు వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు అధికారులు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. లైజన్‌ అధికారులు అతిథులకు స్వాగతం నుంచి బస ఏర్పాటు చేసిన చోటు వరకు జాగ్రత్తగా చేరుకునేలా చూడాలన్నారు. పోలీసుశాఖ బందోబసు ఏర్పాట్లను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలన్నారు. అతిథులకు తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. డెలిగేట్లు బస చేసే హోటళ్ల వద్ద అంబులెన్సు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో జాతీయ మహిళా సాధికారత సదస్సును విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేసీ శుభం బన్సల్‌, సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్రమీనా, డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేడు పార్లమెంటు, అసెంబ్లీ స్పీకర్ల రాక

మహిళా సాధికారత సదస్సు నేపథ్యంలో శనివారం సాయంత్రానికే పలువురు ప్రముఖులు తిరుపతికి చేరుకోనున్నారు. వారికి వసతి, బస, వాహనాల కేటాయింపులో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా శనివారం సాయంత్రం 6గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ కూడా రాబోతున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ చింతకాలయ అయన్నపాత్రుడు మధ్యాహ్నం 3.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం పార్లమెంటు స్పీకర్‌కు స్వాగతం పలుకుతారు. ఇక, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు మధ్యాహ్నం 3గంటలకు తిరుపతికి చేరుకుని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తారు. ఇక, పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ శనివారం చేరుకోనుంది. రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సవిత, పయ్యావుల కేశవ్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సభ్యులు ఒక రోజు ముందే తిరుపతికి రానున్నారు. మరికొందరు తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం మహిళా సాధికారత సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి సోమవారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొనున్నారు.

రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో తాజ్‌హోటల్‌ సమీపంలోని హెలిప్యాడ్‌కు ఆదివారం ఉదయం చేరుకుంటారు. తిరుపతిలోని శ్రీకన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే విట్‌ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు విశ్వనాథం మనవరాలు కాదంబరి వివాహానికి ఉదయం 9గంటలకు హాజరవుతారు. తిరిగి రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. జాతీయ మహిళసాధికారత సదస్సు ప్రారంభకార్యక్రమంలో పాల్గొంటారు. డెలిగేట్లకు మధ్యాహ్నం ఆతిథ్యం ఇవ్వనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్థన్‌రాజు శుక్రవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. హెలిప్యాడ్‌, రాహుల్‌ కన్వెన్షన్‌సెంటర్‌, శ్రీకన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించారు. సీఎం పర్యటనలో అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా చిన్న పొరబాట్లకు తావు ఇవ్వరాదని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ మౌర్య, ఏఎస్పీ రవి మనోహరాచారి, ఆర్డీవో రామమోహన్‌, డీపీవో సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:12 AM