రేషన్ డీలర్లకు కొత్త ఈ-పోస్ యంత్రాలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:40 AM
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే స్మార్టు కార్డులు పంపిణీ చేస్తుండగా.. డీలర్లకు ఈనెల 15వ తేది నుంచి అత్యాధునిక ఈ-పోస్ యంత్రాలను అందజేయనుంది.
15 నుంచి అందుబాటులోకి..
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే స్మార్టు కార్డులు పంపిణీ చేస్తుండగా.. డీలర్లకు ఈనెల 15వ తేది నుంచి అత్యాధునిక ఈ-పోస్ యంత్రాలను అందజేయనుంది. కాగా, 2015లో డీలర్లకు అందచేసిన ఈ-పోస్ మిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. నెట్‌వర్కు సిగ్నల్ లేని మారుమూల గ్రామాలు, శివారు ప్రాంతాల్లో సరుకుల పంపిణీ కష్టతరంగా మారింది. ఫలితంగా పంపిణీలో తీవ్ర జాప్యం తలెత్తి కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎలాంటి లోపాలకు తావులేని విధంగా సరికొత్తగా ఈ-పోస్ మిషన్లు ఇవ్వనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లోని క్యూఆర్ కోడ్‌ను వీటితో స్కాన్ చేస్తే ఆ కార్డుదారుల వివరాలు ఈపో్‌సలో నమోదవుతాయి. ఆ ప్రకారం ఏయే సరుకులు.. ఎన్ని కిలోలు ఇవ్వాలనే వివరాలు నమోదవుతాయి. ఇక, కార్డుదారులకు వేలిముద్ర పడకుంటే కంటి పాపను స్కాన్ చేసేలా దీనిని రూపొందించారు. సిమ్, వైఫై, హాట్‌స్పాట్, బ్లూటూత్, టచ్ స్ర్కీన్ వంటి సదుపాయాలతో ఆండ్రాయిడ్ సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. తద్వారా వ్యవస్థలో పర్యవేక్షణ, నిఘా కట్టుదిట్టంగా ఉంటుందని డీఎ్‌సవో శేషాచలం రాజు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. కార్డుదారులు తీసుకునే బియ్యం సహా సరుకుల వివరాలు, ధర తెలుపుతూ రశీదు జారీ చేస్తారన్నారు.