Share News

సెప్టెంబరు 14, 15 తేదీల్లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:51 AM

తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో సెప్టెంబరు 14, 15 తేదీల్లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు (చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు) నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు.

సెప్టెంబరు 14, 15 తేదీల్లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు
జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తదితరులు

తిరుపతి వేదికగా నిర్వహణ

హాజరుకానున్న 300మందికి పైగా మహిళా ప్రజాప్రతినిధులు

ఏర్పాట్లు పక్కాగా ఉండాలంటూ అధికారులకు స్పీకర్‌ ఆదేశం

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో సెప్టెంబరు 14, 15 తేదీల్లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు (చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు) నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. తిరుపతి కలెక్టరేట్‌లో బుధవారం డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి సదస్సు నిర్వహణపై జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. దేశంలోని 31 అసెంబ్లీలలో మహిళా కమిటీలు ఉన్నాయన్నారు. ఈ కమిటీల ద్వారా అనేక సమస్యలపై చర్చలు జరుగుతుంటాయని తెలిపారు. ప్రతి సమస్యను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పరిష్కరించాలంటే కష్టమైన పనని, అందుకోసమే ఇలాంటి సదస్సులు నిర్వహించి అందులో చర్చా విధానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే చట్టసభల జాతీయ మహిళా సాధికారిత సభ్యుల సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలుత విశాఖలో నిర్వహించాలని అనుకున్నా.. శ్రీవారు కొలువైన తిరుపతిలో నిర్వహించాలని పార్లమెంట్‌ స్పీకర్‌ ఓంబిర్లా సూచించారన్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెప్టెంబరు 14, 15 తేదీలలో తిరుపతిలో పార్లమెంటరీ, లెజస్లేటివ్‌ కమిటీ ఆన్‌ ఎన్‌పవర్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీకి ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు.. ప్రతి అసెంబ్లీ నుంచీ ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు తాజ్‌ హోటల్‌లో జరిగే ఈ సదస్సుకు హాజరవుతారన్నారు. ఇలా 300మందికిపైగా హాజరయ్యే సభ్యులు రెండు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఆ నివేదికను పార్లమెంటు, అసెంబ్లీ ద్వారా తీసుకెళ్తారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ‘సదస్సు అనంతరం తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీసిటీ, శ్రీహరికోట, చంద్రగిరి కోటను సభ్యులు సందర్శిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. సదస్సు, వీరి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.

మహిళాభ్యున్నతికి సీఎం కృషి

సీఎం చంద్రబాఉ నాయుడు మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎక్కడా లేనివిధంగా చట్టసభల్లో, పదవుల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తిరిగి 15 రోజుల తర్వాత మళ్లీ సమీక్షిస్తామన్నారు. వచ్చే కమిటీ సభ్యులకు బస, వసతి ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్‌రెడ్డి, నెలవల విజయశ్రీ, ఆదిమూలం, రామకృష్ణ, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, తుడా చైర్మన్‌ డాలర్స్‌ దివాకర్‌రెడ్డి, జేసీ శుభం బన్సల్‌, డీఆర్వో నరసింహులు, కమిషనరు మౌర్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నరసింహయాదవ్‌, సుగుణమ్మ, సదాశివం, హరిప్రసాద్‌, టీడీపీ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 01:51 AM