Share News

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:03 AM

వికసిత భారత్‌ సాధించాలంటే.. మహళల ఆర్థిక సాధికారత కీలకం. ఈ దిశగా అడుగులు వేసేలా రెండు రోజులపాటు తిరుపతిలోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు దోహదపడింది.

మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి
వేదికపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, పురందేశ్వరి, రఘురామకృష్ణంరాజు, అయ్యన్న పాత్రుడు, ఓం బిర్లా

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):

వికసిత భారత్‌ సాధించాలంటే.. మహళల ఆర్థిక సాధికారత కీలకం. ఈ దిశగా అడుగులు వేసేలా రెండు రోజులపాటు తిరుపతిలోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన జాతీయ మహిళా సాధికారత సదస్సు దోహదపడింది. మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఆర్థికాభివృద్ధి, డిజిటల్‌ అక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, సైబర్‌ భద్రత కల్పించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని సదస్సు చర్చించింది. ఈ సదస్సుకు లోక్‌సభ, రాజ్యసభ, 20కిపైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టసభల సాధికారత కమిటీలకు సంబంధించి 200మందికిపైగా వచ్చారు. తొలిరోజు సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరు కావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణంతో ఆయన పర్యటన రద్దయింది. రెండో రోజు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటి రోజు సదస్సులో మహిళలు ఎదుర్కొఒంటున్న సమస్యలపై విడతల వారిగా సభ్యులు చర్చించారు. వాటిపరిష్కారానికి పలు తీర్మానాలు చేశారు. రెండో రోజైన సోమవారం మహిళా సాధికారత కమిటీలు చర్చించిన పలు తీర్మానాలను ఆమోదిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఇక డెలిగేట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ అసెంబ్లీ, జిల్లా యంత్రాంగం సమష్టిగా కృషి చేసింది. కాగా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచీ మహిళా ప్రతినిధుల బృందాలు వచ్చాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, పార్లమెంటరీ మహిళా సాధికారత అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయా బృందాల వద్దకెళ్లి యోగక్షేమాలతోపాటు బస, వసతి తదితరాలను గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడించేలా సాధికారత సదస్సు నిర్వహించామని, అందుకు కారణం జిల్లా యంత్రాంగం పాత్ర చాలా కీలకమని స్పీకర్‌ ప్రశంసించారు. సదస్సు ముగిసిన వెంటనే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి దంపతులు ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేశారు. ఉదయం తిరుమల శ్రీవారిని, మధ్యాహ్నం శ్రీకాళహస్తీశ్వరుడిని పలువురు డెలిగేట్లు దర్శించుకున్నారు. తొలిరోజు రాత్రి చంద్రగిరి కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తిరుపతి కమిషనర్‌ మౌర్య పర్యవేక్షణలో డెలిగేట్లకు ఆత్మీయవిందు ఇచ్చారు. కాగా, ప్రతినిధులు మంగళవారం ఉదయం వారి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:03 AM