ఎస్వీయూ వీసీగా నరసింగరావు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:36 AM
ఎస్వీయూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ టాటా నరసింగరావు నియమితులయ్యారు. హైదరాబాదు ఐఐటీ రీసెర్చ్ అడ్వైజర్, అడ్జంక్ట్ ప్రొఫెసర్ అయిన నరసింగరావు గురువారం కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు),అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఎస్వీయూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ టాటా నరసింగరావు నియమితులయ్యారు. హైదరాబాదు ఐఐటీ రీసెర్చ్ అడ్వైజర్, అడ్జంక్ట్ ప్రొఫెసర్ అయిన నరసింగరావు గురువారం కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.మూడేళ్ళ పాటు వీసీగా కొనసాగనున్న నరసింగరావు నానో టెక్నాలజీలో గొప్ప శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందారు.1994లో కాశీలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఈయన మద్రాసు ఐఐటీలో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశారు. టోక్యో యూనివర్సిటీలో 1996లో పోస్టు డాక్టోరల్ ఫెలోగా వ్యవహరించారు. 2001లో టోక్యో వర్సిటీలో అధ్యాపకులుగా చేరారు. హైదరాబాదులోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్‌లో సీనియర్ సైంటిస్టుగా 2003లో చేరి ఇదే కేంద్రానికి డైరెక్టర్‌గానూ సేవలందించారు. హైదరాబాదు ఐఐటీలో అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఎలకో్ట్ర కెమిస్ట్రీ, నానో మెటీరియల్స్ రంగంలో నరసింగరావు పరిశోధనలు మంచి గుర్తింపు పొందాయి. వ్యక్తిగతంగానూ, బృందాలతోనూ పరిశోధనలు చేపట్టిన ఈయన విశేష ఆవిష్కరణలు చేశారు. కరోనా సమయంలో క్రిమి సంహారక మాస్క్‌లను రూపొందించడంలో కృషి చేశారు. అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే బ్యాటరీల తయారీకి ఈయన పరిశోధనలు తోడ్పడ్డాయి.2009లో మెటీరియల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు, 2014లో టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంట్ అవార్డు, 2015లో అకాడమీషియన్ ఆఫ్ ఆసియా ఫసిఫిక్ అకాడమీ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అవార్డు, 2016లో భారత రాష్ట్రపతి నుంచీ అవార్డు, 2017లో ఫెలో ఆఫ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డు, 2022లో ఎంఆర్‌ఎ్‌సఐ మెటీరియల్ సైన్స్ వార్షిక బహుమతిని స్వీకరించారు.190 పరిశోధనా వ్యాసాలు రూపొందించారు.ఈయన పరిశోధనలకు 20 జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి.