Share News

బిగ్‌బాస్‌ షోపై నా పోరాటం ఫలించింది

ABN , Publish Date - May 06 , 2025 | 01:06 AM

బిగ్‌బాస్‌ షో నిర్వాహకులపై తాను కొన్నేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ షోలు, అందాల పోటీలను నిర్వహించడం నీచ సంస్కృతి అన్నారు.

బిగ్‌బాస్‌ షోపై నా పోరాటం ఫలించింది
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ

-తెలంగాణాలో అందాల పోటీలు నిర్వహించడం మంచి పద్ధతి కాదు

- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

తిరుపతి(ఆటోనగర్‌), మే 5(ఆంధ్రజ్యోతి): బిగ్‌బాస్‌ షో నిర్వాహకులపై తాను కొన్నేళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించిందని, హైకోర్టు నోటీసులు పంపడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ షోలు, అందాల పోటీలను నిర్వహించడం నీచ సంస్కృతి అన్నారు. బిగ్‌బాస్‌ షో, అందాల పోటీలు నిర్వహించడం ముమ్మాటికీ అసాంఘిక చర్యగా అభివర్ణించారు. బిగ్‌బాస్‌ షో ద్వారా సమాజానికి హాని ఉందన్నారు. ఈ షోలకు ప్రజలు ఆకర్షితులై దేశ సంస్కృతిని చిన్నచూపు చూసే అవకాశముందన్నారు. బిగ్‌బాస్‌ షోలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను ఆపాలని పోలీస్‌ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించానని చెప్పారు. మూడేళ్లుగా ఈ పోరాటం చేస్తూ చివరకు హైకోర్టును ఆశ్రయించామన్నారు. కొంత కాలయాపన జరిగినా చివరకు హైకోర్టు బిగ్‌బాస్‌ షో నిర్వాహకులకు నోటీసులు పంపడం ఆనందంగా ఉందన్నారు. బిగ్‌బాస్‌ షోల ద్వారా నిర్వాహకులు సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇవ్వాలనుకున్నారో వివరణ ఇవ్వాలన్నారు. స్ర్తీలను గౌరవిస్తున్న మన దేశ సంస్కృతిలో ఇలాంటి షోలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణాలో అందాల పోటీలు నిర్వహించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశ సంస్కృతి వైపు చూస్తుంటే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం స్ర్తీలను పాశ్చాత్య సంస్కృతి వైపు మళ్లించే ప్రయత్నాలు చేయడం అన్యాయమన్నారు. దేశ ప్రజలపై ఇలాంటి ప్రభావాలు పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ నాయకులు ఎ.రామానాయుడు, పి.మురళి, రాధాకృష్ట, సి.పెంచలయ్య, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 01:06 AM