ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:56 AM
ఇప్పటికే అవసరమైన భూముల సేకరణ ఆశించిన స్థాయిలో జీడీపీ, జీవీఏ కలెక్టర్ల సదస్సులో జిల్లాపై సీఎం సమీక్ష
చిత్తూరు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు జిల్లాల పరిస్థితులపై సమీక్షించారు. ఏయే అంశాల్లో మన జిల్లా ముందంజలో ఉంది.. ఎక్కడ వెనుకబడిందో తెలియజేస్తూ కలెక్టరు సుమిత్‌కుమార్‌కు పలు సూచనలూ చేశారు. జిల్లా జీడీపీ, ఆయా సెక్టార్లలో జీవీఏ కూడా ఆశించిన స్థాయిలో ఉన్నాయన్నారు.
మూడు విడతల్లో పారిశ్రామిక పార్కులు
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో పలమనేరు, కుప్పం.. రెండో విడతలో నగరి, పుంగనూరు, చిత్తూరు.. మూడో విడతలో పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నగరి నియోజకవర్గం మాంగాడులో 50 ఎకరాలు, పుంగనూరు నియోజకవర్గం చదళ్లలో 21.80 ఎకరాలు, చిత్తూరు నియోజకవర్గం వెంకటాపురంలో 67.91 ఎకరాలు, కుప్పం నియోజకవర్గం పొగురుపల్లెలో 34.57 ఎకరాలు, పలమనేరు నియోజకవర్గం నంగమంగళంలో 4 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేయనుండగా.. ఇవన్నీ ఏపీఐఐసీ అధీనంలో ఉన్న స్థలాలే. పూతలపట్టు కోసం 87.75 ఎకరాలు, జీడీనెల్లూరు కోసం 81.89 ఎకరాల డీకేటీ స్థలాల్ని గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో మూడో విడతలో పార్కుల్ని ఏర్పాటు చేయనున్నారు.ఇవి కాకుండా కుప్పంలో 13.70 ఎకరాల్లో ఓ ప్రైవేటు పార్కు కోసం ఫౌండేషన్ వేశారు.
రూ.2052 కోట్లతో భారీ పరిశ్రమలు
పరిశ్రమ పెట్టుబడి(రూ.కోట్లలో) ఉపాధి గ్రౌండింగ్ అయిన నెల
1.అబిస్ ప్రొటీన్ 350 790 జూన్, 2025
2.శ్రీజ మిల్క్ కంపెనీ 282 400 డిసెంబరు, 2025
3.ఏస్ ఇంటర్నేషనల్ 786.15 1000 నవంబరు, 2025
4.మదర్ డెయిరీ 427 180 డిసెంబరు, 2025
5.ఎస్వీఎఫ్ సోఫా 207.56 600 డిసెంబరు, 2025
జిల్లాకు రూ.2052 కోట్లతో 5 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇటీవల అవన్నీ గ్రౌండింగ్ అయ్యాయి. ఆ మధ్య క్యాబినెట్ కూడా వీటిని ఆమోదించింది. వీటిలో ఎక్కువగా కుప్పం ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి.రాష్ట్రంలో మరే జిల్లాలో కూడా ఈ స్థాయిలో పరిశ్రమలు రాలేదు. ఈ 5 పరిశ్రమలతో పాటు స్నేహ ఫామ్స్ పరిశ్రమ చిత్తూరుతో పాటు నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కలిపి రూ.450 కోట్లతో 559మందికి ఉపాధి లక్ష్యంగా అక్టోబరు, 2025లో గ్రౌండింగ్ అయింది.
మరో మూడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
ఇవి కాకుండా మరో మూడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఆయా పరిశ్రమలు డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) ఇస్తే.. ఏపీఐఐసీ వాటికి అవసరమైన భూమి ఇవ్వాల్సి ఉంది. రెడ్ బెర్రీ ఫుడ్ లాజెస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1200 కోట్లతో 10 వేల మందికి ఉపాధి లక్ష్యంగా ముందుకొచ్చింది. దీనికి 150 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. జల్లికట్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రూ.110 కోట్లతో 1050 మందికి ఉపాధి లక్ష్యంగా ముందుకొచ్చింది. దీనికి 10 ఎకరాలు కావాలి. వెల్డ్ రూస్టర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.30 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పిస్తామని ముందుకు రాగా, ఏపీఐఐసీ 30 ఎకరాల్సి కేటాయించాల్సి ఉంది.
కుప్పంలో రూ.2081 కోట్లతో పరిశ్రమ
కుప్పం ప్రాంతంలో ఎన్‌పీఎస్‌పీఎల్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రాజెక్టు రూ.2081 కోట్లతో 600 మందికి ఉపాధి లక్ష్యంగా ఏర్పాటు కానుంది. దీనికి అవసరమైన 130 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.సెమీకండక్టర్ మెటీరియల్స్, ఎలక్ర్టిక్ వాహనాలు, సౌర పరిశ్రమ, డిఫెన్స్, ఎలక్ర్టానిక్స్ తయారీలో అవసరమైన ఆధునిక పరికరాలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.
డ్వాక్రా రుణాలు 63 శాతమే
డ్వాక్రా సంఘాలకు లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడంలో జిల్లా వెనుకబడి ఉంది. ఎంసీపీ-1 (ఉత్పాదక రుణాలు), ఎంసీపీ-2 (వినియోగ రుణాలు) కింద 63 శాతం రుణాల్ని మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాకు రూ.2427.51 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.1527.24 కోట్ల రుణాలు మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా పంపిణీ చేశారు.
మామిడి దిగుబడి పెంచాలి
ప్రస్తుతం జిల్లాలో హెక్టారుకు 12 టన్నుల మామిడి దిగుబడి ఉండగా, దీన్ని ఉత్తరప్రదేశ్ తరహాలో 17 టన్నులకు పెంచాలని.. అలాగే జీడీపప్పు 1.5 టన్నుల నుంచి 4 టన్నులకు ఫిలిప్ఫీన్స్ దేశ తరహాలో పెంచాలని సీఎం సూచించారు. ఇవి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అధికంగా సాగవుతున్నాయి. మామిడితో పాటు జిల్లాలో సాగవుతున్న టమోటా, దానిమ్మ ఉత్పత్తి, నాణ్యత పెంచాలని సూచించారు.
ఉగాది నాటికి గృహ ప్రవేశాలు
వచ్చే ఉగాది నాటికి గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం సూచించారు. జిల్లాకు పీఎంఏవై కింద అప్పట్లో 73098 గృహాలు మంజూరవగా, 58966 పూర్తి కాగా, 11048 పురోగతిలో ఉన్నాయి. మొత్తంగా 70,014 గ్రౌండింగ్ అయ్యాయి. పాతవి 9912, కొత్తగా మంజూరైన 2105 కలిపి మొత్తంగా 12048 గృహాల్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు.
సగం ఏడాదిలో జిల్లా జీడీపీ 40.39 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లా స్థూల ఉత్పత్తి విలువ రూ.60,003 కోట్లుగా నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు అంటే తొలి రెండు త్రైమాసికాలలో రూ.24,238 కోట్లతో జిల్లా లక్ష్యంలో 40.39 శాతం సాధించింది. వాస్తవానికి 50 శాతం అధిగమించాల్సి ఉండగా, సుమారు 9.61 శాతం వెనుకబడింది. మిగిలిన సగం ఏడాదిలో రూ.35,765 కోట్లతో 59.61 శాతం ఉత్పత్తి విలువను సాధించాల్సి వుంది.
ఆయా సెక్టార్లలో జిల్లా జీవీఏ స్థానాలు
సెక్టారు జీవీఏ లక్ష్యం సాధించింది మిగిలిన లక్ష్యం
(రూ.కోట్లలో) (ఏప్రిల్-సెప్టెంబరు)
వ్యవసాయ అనుబంధం 22,050 7664 (34.76ు) 14386 (65.24ు)
పరిశ్రమలు 10180 4797 (47.13) 5382 (52.87ు)
సర్వీసు 22854 10034 (43.90ు) 12820 (56.10ు)
వ్యవసాయ అనుంధ సెక్టారులో చిత్తూరు జిల్లా 9వ స్థానంలో ఉండగా, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు 18, 21 స్థానాల్లో ఉన్నాయి. పరిశ్రమల సెక్టారులో చిత్తూరు జిల్లా 8వ స్థానంలో ఉండగా, అన్నమయ్య జిల్లా 2వ, తిరుపతి 10వ స్థానంలో ఉన్నాయి. సర్వీసు సెక్టారు విషయానికొస్తే.. చిత్తూరు 22వ, తిరుపతి 24వ, అన్నమయ్య 10వ స్థానాల్లో ఉన్నాయి.
ఆయా ఉత్పత్తుల్లో జిల్లా స్థానాలు
ఉత్పత్తి జీవీఏ లక్ష్యం సాధించింది మిగిలిన లక్ష్యం
(రూ.కోట్లలో) (ఏప్రిల్-సెప్టెంబరు)
పాలు 5139 2311 2829
మాంసం 6232 2816 3416
గుడ్లు 571 254 318
పాలు, మాంసం ఉత్పత్తిలో జిల్లా ముందంజలో ఉండగా, గుడ్ల ఉత్పత్తిలో కాస్త వెనుకబడిందని, దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టరుకు సూచన అందింది.
వాట్సాప్ గవర్నెన్స్‌పై అనాసక్తి
దీన్ని ఇంటింటికి తీసుకెళ్లేందుకు ఉద్యోగుల్లో ఆసక్తి కనిపించడం లేదు. మొత్తం 4594 మంది ఉద్యోగుల్లో 2971 మంది మాత్రమే ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన 1623 మంది అసలు పట్టించుకోలేదు.
అటెండెన్స్‌పై నిర్లక్ష్యం
జిల్లాలోని 3280 మంది సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ పనిచేస్తోంది. 15 రోజుల సగటు హాజరు వివరాలను పరిశీలించగా, 1250 మంది మాత్రమే అటెండెన్స్ వేసుకుంటున్నారు. మిగిలినవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆధార్ అప్‌డేట్‌లో మొదటి స్థానం
ఆధార్ నిబంధల మేరకు 5-7 ఏళ్ల, 15-17 ఏళ్ల మధ్యలో వయసున్న పిల్లల ఆధార్ అప్‌డేట్ చేయాలి. చిత్తూరు జిల్లాలో 48948 మంది ఈ వయసువారు ఉండగా, డిసెంబరు 13 నాటికి 30,929 మందికి అప్‌డేట్ చేశారు. 63శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.
ఎస్సీ గ్రామాలకు రూ.34.66 కోట్లు
జిల్లాలో 103 ఆదర్శ ఎస్సీ గ్రామాల్ని గుర్తించారు. అక్కడ 867 పనుల్ని రూ.34.66 కోట్లతో మంజూరు చేశారు. 48 పనులు పూర్తి చేయగా, 28 లక్షలు ఖర్చు చేశారు. రూ.34.38 కోట్లతో 819 పనులు చేయాల్సి ఉంది.
సెప్టెంబరు 30 నాటికి చిత్తూరు జిల్లాలో 3173 బ్యాంకు అకౌంట్లలో రూ.7.40 కోట్ల అన్‌క్లయిమ్డ్ నిధులు ఉన్నాయి.