Share News

ఘనంగా సోమవారోత్సవాలు

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:21 AM

రామకుప్పం పట్టణ శివార్లలోని వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్షిక సోమవారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మూలమూర్తికి పురోహితులు కృష్ణమూర్తి, వాసు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, వెండి కవచధారణతో విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం నెమలి వాహనంపై వళ్ళీ, దేవసేన, సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు పురోహితుడు హరినాథ్‌ విశేష పూజలు నిర్వహించారు.

ఘనంగా సోమవారోత్సవాలు
సోమవారోత్సవాలను ప్రారంభిస్తున్న సీతాపతి, చంద్రారెడ్డి

రామకుప్పం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం పట్టణ శివార్లలోని వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వార్షిక సోమవారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మూలమూర్తికి పురోహితులు కృష్ణమూర్తి, వాసు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, వెండి కవచధారణతో విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం నెమలి వాహనంపై వళ్ళీ, దేవసేన, సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు పురోహితుడు హరినాథ్‌ విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ పెద్దలు సీతాపతి, చంద్రారెడ్డి ప్రాకారోత్సవంతో సోమవారోత్సవాలను ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు తొలుత ఆలయ ఈశాన్య దిక్కున గల నాగులపుట్ట వద్ద పూజలు చేసి పాలు, పండ్లు సమర్పించారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు రావి, వేప వృక్షాలకు పూజలు చేసి కొమ్మలకు జోలెలు కట్టి స్వామివారిని దర్శించుకున్నారు. కళ్ళ, చెవుల రుగ్మతలతో బాధపడుతున్న వారు వెండితో చేసిన కళ్ళు, చెవులు, సర్పదోషం ఉన్నవారు నాగపడిగలను స్వామి వారి హుండీలో వేసి మొక్కుకున్నారు. మొక్కులు నెరవేరిన భక్తులేమో స్వామివారికి ప్రాకారోత్సవాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగులముద్దమ్మ, శనీశ్వరస్వామి, వినాయకాలయం, పద్మావతి, వేంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా భక్తజనంతో కిటకిటలాడాయి. సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పంబవాయిద్యాల నడుమ పట్టణ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి కుండకావళ్ళు, పూలకావళ్ళు, నెమలి కావళ్ళు, వీపుతేర్లు సమర్పించారు. పలువురు భక్తులు దవడలకు శూలాలు, శరీరాలపై సూదులతో నిమ్మకాయలు గుచ్చుకుని వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. సీఐ మల్లే్‌షయాదవ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వెంకటమోహన్‌, ట్రైనీ ఎస్‌ఐ మధుసూదన్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Sep 02 , 2025 | 01:22 AM