Share News

తిరుపతి అభివృద్ధికి మోదీ ఎంతో చేస్తున్నారు

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:47 AM

తిరుపతిని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి చెప్పారు.

తిరుపతి అభివృద్ధికి మోదీ ఎంతో చేస్తున్నారు
సభికులకు అభివాదం చేస్తున్న ఉత్తరాఖండ్‌ సీఎం

అటల్‌- మోదీ సుపరిపాలన సభలో ఉత్తరాఖండ్‌ సీఎం

ఘనంగా వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

రేణిగుంట డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘అటల్‌- మోదీ సుపరిపాలన యాత్ర’లో రేణింగుంట సమీపం మర్రిగుంట కూడలి వద్ద వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మోదీ పదకొండేళ్ల పరిపాలనలో దేశంలో ఏడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ప్రారంభిస్తే అందులో ఒకటి తిరుపతి ఐఐటీ అని గుర్తుచేశారు. తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారని వెల్లడించారు. ప్రపంచ దేశాలలో భారత్‌ పేరును కీర్తి పతాకంలోకి ఎక్కించి దేశంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్పవ్యక్తి వాజ్‌పేయి అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి విమానాశ్రయం.. జాతీయ రహదారుల అనుసంధానానికి వాజ్‌పేయి కృషి చేశారని సామంచి శ్రీనివాస్‌ అన్నారు. అందుకే ఆయన విగ్రహాన్ని జాతీయ రహదారిపై, విమానాశ్రయానికి దగ్గరగా ఏర్పాటు చేశామని, ఇకపై ఈ కూడలిని అటల్‌ బిహారీ వాజపేయి సర్కిల్‌గా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నరసింహ యాదవ్‌, డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, రుద్రకోటి సదాశివం, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్‌ నాయుడు, దయాకర్‌ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్‌, శ్రీకాళహస్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెంచయ్య నాయుడు, మాజీ ఎంపీ వరప్రసాద్‌, బీజేపీ నేత శాంతారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. కాగా, సభా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్వదేశీ, చేనేత వస్త్రాలు, అటల్‌ బిహారీ వాజపేయి రాజకీయ జీవితంలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించిన ఫొటో గ్యాలరీని ఉత్తరాఖండ్‌ సీఎం తిలకించారు.

Updated Date - Dec 15 , 2025 | 01:48 AM