అక్కడ మిస్సింగ్.. ఇక్కడ హత్య
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:58 AM
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మిస్సింగ్ అయిన వ్యక్తి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చంద్రిగిరి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మిస్సింగ్ అయిన వ్యక్తి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె రూరల్‌కు చెందిన ఆవుల నరసిహులు, నాగరాజు, కత్తి నరసింహులు, నారాయణస్వామి.. చంద్రగిరి మండలం నరసింగాపురానికి చెందిన మునిరాజ స్నేహితులు. వీళ్లు తాంత్రిక వైద్యం, గుప్త నిధులు తవ్వకాలు చేస్తుంటారు. అయితే ఆవుల నరసింహులు.. తన భార్యతో సన్నిహితంగా ఉండటంపై నాగరాజు ఆగ్రహించాడు. ముందస్తు పథకం ప్రకారం అక్టోబరు 27వ తేదీన చంద్రగిరిలో తాంత్రిక వైద్యం చేయాలని ఆవుల నరసింహులు, నారాయణస్వామి, కత్తి నరసింహులను మదనపల్లెలో బస్సు ఎక్కించి పంపించాడు. వాళ్లకు తెలియకుండా వెనక మరో బస్సు ఎక్కి శ్రీనివాసమంగాపురంలో నాగరాజు దిగాడు. నరసింగాపురంలోని మునిరాజకు ఫోన్ చేసి ద్విచక్ర వాహనం తీసుకురమ్మని చెప్పాడు. అనంతరం ఆవుల నరసింహులు ఒక్కడినే శ్రీనివాసమంగాపురానికి పిలిపించారు. ద్విచక్ర వాహనంలో అతడిని ఎక్కించుకుని.. మామిడి తోపులోకి నాగరాజు, మునిరాజ తీసుకెళ్లారు. అక్కడ హత్య చేసి, పూడ్చి వేశారు.ఆవుల నరసింహులు కనిపించడంలేదని మదనపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్నేహితులనూ విచారించగా.. నాగరాజ, మునిరాజు హత్య చేసినట్లు తెలిసింది. దీంతో మదనపల్లె పోలీసులు గురువారం నిందితులను తీసుకొచ్చి మృత దేహనికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.