డీసీసీబీలో రూ.21.12 కోట్ల దుర్వినియోగమైనట్లు గుర్తింపు
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:51 AM
వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. వైసీపీ వర్గీయులకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలివ్వడం, నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల ప్రమోషన్లలో అక్రమాలు.. ఇలా ఏ అంశంలో చూసినా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించలేదు. ఎట్టకేలకు డీఆర్వో మోహన్‌కుమార్ నిర్వహించిన సహకార చట్టం సెక్షన్-51 విచారణలో నాటి పాపాల పుట్ట బద్ధలైంది. ఒక్కొక్కటిగా ‘లెక్క’ తేలుస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యకలాపాలు అడ్డగోలుగా సాగాయి. బ్యాంకు పాలకవర్గం నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. వైసీపీ వర్గీయులకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలివ్వడం, నిధుల దుర్వినియోగం, ఉద్యోగుల ప్రమోషన్లలో అక్రమాలు.. ఇలా ఏ అంశంలో చూసినా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించలేదు. ఎట్టకేలకు డీఆర్వో మోహన్‌కుమార్ నిర్వహించిన సహకార చట్టం సెక్షన్-51 విచారణలో నాటి పాపాల పుట్ట బద్ధలైంది. ఒక్కొక్కటిగా ‘లెక్క’ తేలుస్తున్నారు.
సర్‌చార్జి విచారణ అధికారిగా వెంకటరమణ
బ్యాంకు అక్రమాలపై సెక్షన్-51 విచారణతో తొలి దశ పూర్తయ్యింది. 48 మంది బ్యాంకు ఉద్యోగులు బలయ్యారు. మొత్తం 21.12 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఇక రెండో దశ విచారణ ప్రారంభం కాబోతుంది. కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాలతో సహకార చట్టం 1964 మేర 60-1 సెక్షన్ కింద బ్యాంకు అవినీతి, అక్రమాల్లో బాధ్యులైన 120 మందిపై విచారణకు ఆదేశించారు. సర్‌చార్జి విచారణ అధికారిగా సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ (డీఆర్) ఎం.వెంకటరమణను నియమించారు. 2026 జనవరి నెలాఖరులోగా బాధ్యులందరిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.
నోటీసుల జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం
సెక్షన్-51 విచారణలో గుర్తించిన 120 మంది డిఫాల్టర్లకు సర్‌చార్జి నోటీసులు జారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చేనెల 6వ తేదీనుంచి చిత్తూరు కేంద్రంలోని డీఆర్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని 15 రోజులకు ముందుగా జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. రోజుకు ఐదుగురు చొప్పున ‘సహకార కోర్టులో’ విచారణ చేయనున్నారు. ఇందులో బ్యాంకు అప్పటి పర్సన్ ఇన్‌చార్జి పాలకవర్గం చైర్‌పర్సన్, డైరెక్టర్లతోపాటు మొన్న సస్పెండైన 48 మంది బ్యాంకు ఉద్యోగులు, ఉమ్మడి జిల్లాలోని సింగిల్‌విండోల సీఈవోలు, ఉద్యోగులు, అక్రమంగా రుణాలు పొందిన లబ్ధిదారులు ఉన్నారు.
ఆస్తుల ‘కండీషనల్ అచాట్‌మెంట్,
బ్యాంకు ఖాతాల స్తంభనపై త్వరలో ఆదేశాలు
సెక్షన్-51 విచారణలో డిఫాల్టర్లుగా గుర్తించిన 120 మందికి సంబంధించిన ఆస్తుల ‘కండీషనల్ అటాచ్‌మెంట్’ కోసం ముందస్తుగా ఆయా ప్రాంతాల సబ్‌రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్ ద్వారా అధికారిక ఆదేశాలు త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. వారి పేరిట వివిధ బ్యాంకుల్లోని ఖాతాలను సైతం స్తంభింపజేయనున్నారు.