లబ్ధిదారులకు తెలియకుండానే నిధుల స్వాహా
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:41 AM
ఆరుబయట మల, మూత్ర విసర్జన లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి కొందరు అధికారులు తూట్లు పొడిచారు. నిర్మాణం ఒకరిదైతే మరొకరి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేశారు.
కల్లూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆరుబయట మల, మూత్ర విసర్జన లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి కొందరు అధికారులు తూట్లు పొడిచారు. నిర్మాణం ఒకరిదైతే మరొకరి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేశారు.పులిచెర్ల మండలం కల్లూరులో 2018వ సంవత్సరంలో వందల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టగా కొన్నింటి బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరగడంతో 51మంది లబ్ధిదారులు కలెక్టర్‌కు ఫిర్యాధు చేయడంతో విచారణ చేపట్టారు. అప్పట్లో కొందరిపై కల్లూరు పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో వారం క్రితం మరుగుదొడ్ల లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 51మంది లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నా 26 మంది లబ్ధిదారులకు మాత్రమే విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మంగళవారం కల్లూరు సచివాలయంలో డీఎల్‌డీవో రవికుమార్ విచారణ చేపట్టగా 19మంది మరుగుదొడ్ల లబ్ధిదారులు హాజరయ్యారు.ఇందులో 15మంది లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకున్నా తమకు ఎలాంటి నగదు బ్యాంకు ఖాతాలో జమకాలేదని సృష్టం చేశారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు పాక్షికంగా నగదు చేరిందని, మరో ఇద్దరు తమకు పూర్తిగా నగదు చేరిందని తెలిపారు.కల్లూరులో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయనే విషయంపై పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని డీఎల్డీవో రవికుమార్ తెలిపారు. విచారణలో పాల్గొన్న అధిక శాతం మంది మరుగుదొడ్ల లబ్ధిదారులు తమకు నగదు జమకాలేదని తెలిపారన్నారు. విచారణ పూర్తి వివరాలను కమిషనర్‌కు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ విచారణలో ఎంపీడీవో రాజశేఖర బాబు, జడ్పీ కార్యాలయ ఏవో ఎస్‌ఎన్ ఆలీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ భుజంగరావు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.