మహిళాభివృద్ధికి మైలురాయి
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:12 AM
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎన్నింటికో వేదికగా నిలిచిన తిరుపతి తాజాగా కీలకమైన తొలి జాతీయ మహిళా సాధికార సదస్సుకు వేదికగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మహిళాభివృద్ధికి దోహదం చేసే అంశాలపై ఈ సదస్సులో చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు. తిరుపతి వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకరు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఏపీ సీఎం, గవర్నర్, అసెంబ్లీ స్పీకరు, మండలి ఛైర్మన్, పలువురు మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
లోక్‌సభ స్పీకరు, సీఎం, గవర్నర్ సహా పలువురు ప్రముఖుల రాక
తరలివస్తున్న పార్లమెంటు, అసెంబ్లీల మహిళా కమిటీల సభ్యులు
నేడు సీఎం చంద్రబాబు రాక
తిరుపతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎన్నింటికో వేదికగా నిలిచిన తిరుపతి తాజాగా కీలకమైన తొలి జాతీయ మహిళా సాధికార సదస్సుకు వేదికగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మహిళాభివృద్ధికి దోహదం చేసే అంశాలపై ఈ సదస్సులో చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నారు. తిరుపతి వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకరు, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఏపీ సీఎం, గవర్నర్, అసెంబ్లీ స్పీకరు, మండలి ఛైర్మన్, పలువురు మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పార్లమెంటు, శాసనసభల మహిళా కమిటీల సభ్యులు సదస్సుకు తరలివస్తున్నారు. దేశంలో మహిళాభివృద్ధికి మైలురాయి కాదగిన ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిధ్యమిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంతేస్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. రెండు రోజుల సదస్సుకు సంబంధించి పది రోజులకు పైగా యంత్రాంగం శ్రమించి ముందస్తు ఏర్పాట్లకు దిగింది. 200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్న కారణంగా వారందరికీ విడివిడిగా బస, వాహన సదుపాయాలు ఏర్పాటు చేసింది. దీనికోసం తిరుపతిలోని ఉన్నత స్థాయి హోటళ్ళలో గదులు బుక్ చేసింది. వాహనాలను కూడా సమకూర్చింది. ప్రతి ప్రతినిధికీ వెంట వుండి అవసరమైన వసతులు, సౌకర్యాలూ కల్పించేందుకు లైజన్ ఆఫీసర్లను నియమించింది. వారిపై పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమించింది. సదస్సుకు వేదికగా తిరుచానూరు బైపాస్ రోడ్డులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌ను ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేసింది. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనాలకు సైతం ఏర్పాట్లు చేపట్టింది. తొలిరోజు సాయంత్రం సదస్సు ముగిశాక చంద్రగిరి కోట ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో లోక్‌సభ స్పీకరు, రాజ్యసభ వైస్ ఛైర్మన్లతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఆతిధ్యం ఇస్తున్న కారణంగా ఏపీ అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు, మండలి ఛైర్మన్ మోసేన్ రాజు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలిరోజు సీఎం చంద్రబాబు హాజరై ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మధ్యాహ్నం విందు భోజనాలు ఏర్పాటు చేస్తుండగా రెండవ రోజు ముగింపు సందర్భంగా ప్రభుత్వం తరపున గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రతినిధులకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు రాజకీయాల్లోనే కాకుండా అభివృద్ధి పరంగా ఇతర పార్టీలతో పోలిస్తే టీడీపీయే తొలినుంచీ ప్రాధాన్యత ఇస్తున్న నేపఽథ్యంలో సీఎం చంద్రబాబు తిరుపతి వేదికగా తొలి జాతీయ మహిళా సాధికార సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు చొరవ చూపినట్టు సమాచారం. మొత్తానికి తిరుపతిలో రెండు రోజుల సదస్సు కారణంగా అటు ప్రముఖుల రాకపోకలు, ఇటు భద్రతా ఏర్పాట్లతో నగరంలో హడావిడి బాగా పెరిగింది.
సదస్సు జరిగేదిలా..
ఆదివారం ఉదయం 10గంటలకు సీఎం చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చేరుకుంటారు. శాసనసభ స్పీకర్లు, ప్రతినిధులతో గ్రూప్ ఫొటో దిగుతారు. 10.45గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. 10.50 సదస్సు ప్రారంభమవుతుంది. 11 గంటలకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రముఖులను సత్కరిస్తారు. అనంతంర రాష్ట్ర మహిళలు, శిశు, వికలాంగులు, వృద్ధులు సంక్షేమశాఖ చైర్‌పర్సన్ గౌరు చరితారెడ్డి ప్రసంగిస్తారు. పార్లమెంటు మహిళా సాధికారత చైర్‌పర్సన్ పురంధేశ్వరి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, సీఎం చంద్రబాబు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రసంగిస్తారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ధన్యవాదాలు తెలియజేస్తారు. 12.30 గంటలకు సీఎం అతిఽథ్య విందు ఇస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి సదస్సు ఇతివృత్తంపై చర్చిస్తారు. 4.20గంటలకు తీర్మాన ఆమోదంతో తొలిరోజు సదస్సు ముగియనుంది. రాత్రి 7.30 గంటలకు చంద్రగిరికోటలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అతిథులకు చంద్రగిరి కోటలో విందు ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
రెండో రోజు ఇలా....
సోమవారం ఉదయం సదస్సు ప్రతినిధులు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. పది గంటలకు రాహుల్ కన్వెన్షన్ హాలులో రెండో రోజు సదస్సు ప్రారంభమవుతుంది. గవర్నర్ అబ్దుల్‌నజీర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మహిళా, శిశుు, వికలాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ చైర్‌పర్సన్ గౌరచరితారెడ్డి, పార్లమెంటు మహిళా సాధికారత చైర్‌పర్సన్ పురంఽధేశ్వరి ప్రసంగించనున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ధన్యవాదాల తీర్మానం చేస్తారు. 12.30 గంటలకు గవర్నర్ అతిఽథులకు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు.
ప్రముఖుల సందర్శన
రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు ఏర్పాట్లను శనివారం ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే పులివర్తి నాని, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేష్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధనరాజు, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, పలువురు టీడీపీ నేతలు పరిశీలించారు. సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
చంద్రగిరి కోట సందర్శనకు..
నేటి మధ్యాహ్నం వరకు అనుమతి
చంద్రగిరి కోట సందర్శనకు పర్యాటకులకు ఆదివారం మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి కేంద్రంగా ఆది, సోమవారాలు జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం డెలిగేట్స్ చంద్రగిరి లైటింగ్ షోను వీక్షించనున్నారు. అక్కడే వారికి విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఈ మేరకు ఆంక్షలు విధించినట్లు డీఆర్వో వివరించారు. సోమవారం నుంచి యథాతథంగా పర్యాటకులు కోటను సందర్శించుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రతినిధులతో మర్యాదగా మెలగాలి
జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వచ్చే ప్రజాప్రతినిధులతో మర్యాదపూర్వకంగా మెలగాలని డ్రైవర్లకు ప్రాంతీయ రవాణా శాఖాధికారి మురళీమోహన్ దిశానిర్దేశం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి రానున్న మహిళా ప్రతినిధుల సౌకర్యార్థం 22 వాహనాలను ఏర్పాటు చేశారు. శనివారం వాహన డ్రైవర్లతో కలెక్టరేట్ వద్ద ఆర్టీవో సమావేశమయ్యారు. మహిళా ప్రతినిధుల ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారిణి అతికానాజ్ పాల్గొన్నారు.
నేడు సీఎం చంద్రబాబు రాక
సీఎం నారా చంద్రబాబునాయుడు ఒకరోజు పర్యటన నిమిత్తం ఆదివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 7.30 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 9 గంటలకు తిరుచానూరు సమీపంలోని తాజ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతి డీబీఆర్ ఆస్పత్రి రోడ్డులోని శ్రీకన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని విట్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు విశ్వనాథం మనవరాలు కాదంబరి వివాహానికి హాజరవుతారు. 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరుచానూరు వద్ద రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే జాతీయ మహిళా సాదికారత సదస్సులో పాల్గొంటారు. 10.20 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ డెలిగేట్స్ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించి, గ్రూఫ్ ఫొటో దిగుతారు. 10.30 నుంచి ఒంటి గంట వరకు జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్సులో పాల్గొంటారు. డెలిగేట్స్‌కు మధ్యాహ్నం అతిథ్యం ఇవ్వనున్నారు. 2.05 గంటలకు తాజ్ హోటల్ వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో విజయవాడకు బయలుదేరి వెళతారు.
10గంటలకు రానున్న గవర్నర్
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉదయం 10గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుపతి శ్రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగే విట్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు విశ్వనాథన్ మనవరాలు కాదంబరి వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హోటల్ గ్రాండ్‌రిడ్జ్‌కు చేరుకుని బస చేస్తారు. సోమవారం రాహుల్ కన్వెన్షన్‌లో జరిగే జాతీయ మహిళ సాధికారత సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు.