మెప్మా.. ఇదేంటి చెప్మా..!
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:12 AM
తిరుపతి మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) అక్రమంగా డ్వాక్రా సంఘాలు, పొదుపు గ్రూపుల ద్వారా నిధులను స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో నలుగురు ఆర్పీలను తప్పించారు.
(తిరుపతి, ఆంధ్రజ్యోతి): తిరుపతి మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)లో అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) అక్రమంగా డ్వాక్రా సంఘాలు, పొదుపు గ్రూపుల ద్వారా నిధులను స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో నలుగురు ఆర్పీలను తప్పించారు. దీపికా సమాఖ్య ఆర్పీ నౌహీరా రూ93లక్షలు, తెలుగుతల్లి సమాఖ్య ఆర్పీ హేమలత రూ22లక్షలు, బాలాజీ సమాఖ్య ఆర్పీ భారతి 27.57లక్షలు స్వాహా చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. లక్ష్మీపురానికి చెందిన మరో ఆర్పీ లత రూ.90 లక్షలు స్వాహా చేశారని ఏడాది క్రితం నిర్ధారించి తాత్కాలికంగా తప్పించారు. నగదు తిరిగి చెల్లించేలా ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. అయితే ఇప్పటివరకు చెల్లించకపోవడంతో ఆమెపైనా కేసు నమోదు చేయించామని మెప్మా అధికారి కృష్ణవేణి తెలిపారు.
బోగస్ దందా
నకిలీ రసీదులతో బ్యాంకులనుంచి నగదు డ్రా చేయడం, నకిలీ గ్రూపులు సృష్టించి అవినీతికి పాల్పడిన ఘటనలు పొదుపు సంఘాలను కుదిపేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోగస్ గ్రూపులతో రూ.కోట్ల అవినీతి జరిగినట్టు స్పష్టమవుతోంది. మెప్మాలోని కొందరు అధికారుల అండతో ఆర్పీలు రుణ దందాను ఇంకా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పనిలో పనిగా పొదుపు గ్రూపుల నుంచి దర్జాగా మామూళ్లు వసూలు చేస్తున్నారని సభ్యులు చెబుతున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా బ్యాంకులను బురిడీ కొట్టించడంలో కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. అలాంటి వారిపై చర్యలు లేకపోవడంతో మళ్లీ బోగస్ దందాకు తెరలేపారు.
జీతం కన్నా గీతం ఎక్కువ
ఆర్పీల నెల వేతనం రూ.8వేలు. రుణాల మంజూరుకు సభ్యుల నుంచి వసూలు చేయడమే ఎక్కువన్న విమర్శలున్నాయి. కొందరైతే నకిలీ గ్రూపులను సృష్టించి లక్షలాది రూపాయల రుణాలను మింగేస్తున్నారు. అవినీతి ఆర్పీలకు అండగా ఉంటూ వారికి పొదుపు సభ్యుల ఆధార్ కార్డులను మెప్మా కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కార్యాలయంలోని కొందరు సీవోలు తమ వంతుగా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
అనర్హులే ఆర్పీలు
తిరుపతిలో 155 మంది ఆర్పీలు ఉన్నారు. 5 వేల డ్వాక్రా సంఘాలు అధికారికంగా ఉన్నప్పటికీ సుమారు 4,600 సంఘాలు 162 సమాఖ్యలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. చాలావరకు అనర్హులు ఉన్నారన్న విమర్శలున్నాయి. ఆర్పీగా ఉండేవారు స్వయం సహాయక సంఘ మహిళా సభ్యురాలై ఉండాలి. అంతేకాకుండా నిరుపేద కుటుంబానికి చెంది, స్థానిక నివాసిగా ఉండాలి. 18 నుంచి 40ఏళ్ల వయస్సు కలిగి చురుగ్గా ఉండాలి. స్లమ్ లెవల్ ఫెడరేషన్‌కు కనీస 10వతరగతి, టౌన్ లెవెల్ ఫెడరేషన్‌కు ఇంటర్ విద్యార్హత తప్పనిసరి. సంఘాలలో మూడు నుంచి ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వీరు సంఘంలోని పేద కుటుంబాల కోసం పనిచేయగలిగి, సభ్యుల ఆర్థికాభివృద్ధికి సమావేశాలు నిర్వహించి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. సమర్థవంతగా ఉంటూ, ఆదర్శవంతమైన సభ్యురాలిగా ఉంటేనే ఆర్పీలుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి నిజాయితీ, సహనం, నిబద్ధత, సేవాతత్వం కలిగి, అన్నీ సంఘాల సభ్యుల ఆమోదం పొందిన వారై ఉండాలి. వాటితోపాటు మొబైల్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. నెలలో కనీసం 25 రోజులు సంఘ సమావేశాలు నిర్వహించి అందుకు సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేసినప్పుడే వారికి నెలకు రూ.8వేలు వేతనంగా చెల్లిస్తారు. అయితే తిరుపతిలో చాలావరకు ఈ నిబంధనలేవీ పాటించడంలేదని స్పష్టమవుతోంది. కొందరు పురుషులు కూడా సమాఖ్యలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి సమాఖ్యను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆడిట్ చేయడంతో అవినీతికి చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆడిట్ ప్రక్రియ మొదలైంది.