మెగా డీఎస్సీ ఫలితాలొచ్చాయ్!
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:28 AM
మెగా డీఎస్సీ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే దాదాపు 1478 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జూన్ 5వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు చిత్తూరులో నాలుగు, చెన్నైలోని మరో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు.
రెండు రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
ఆపై కేటగిరి వారీగా తుది ఫలితాల వెల్లడి
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే దాదాపు 1478 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు జూన్ 5వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు చిత్తూరులో నాలుగు, చెన్నైలోని మరో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 1478 పోస్టులకు 26,501మంది అభ్యర్థులు 45,221 దరఖాస్తులు పంపారు. సకాలంలో ఫీజు చెల్లించకపోవడం, నమోదులో లోపాలు, అర్హత లేకపోవడం, ఇతరత్రా కారణాలతో 2701 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా 23,500 మంది అభ్యర్థులు తేలారు. పరీక్షలు దగ్గపడే సమయానికి మరిన్ని కారణాలతో 2160 మంది అభ్యర్థులు పరీక్షలకు దూరం కాగా, చివరకు 21,340 మంది అభ్యర్థులు పరీక్షలకు అర్హత సాధించారు. ఇదిలా ఉండగా జూలై 3వ తేదీ వరకు సాగిన డీఎస్సీ పరీక్షల్లో 19,550 మంది హాజరయ్యారు. ప్రతి పరీక్ష అనంతరం రెండు రోజుల్లో ‘కీ’ని విడుదల చేయగా, ఏడు రోజుల అనంతరం ఫైనల్ ‘కీ’ విడుద చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో సోమవారం రాత్రి డీఎస్సీలో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అభ్యంతరాలు స్వీకరించేందుకు రెండు రోజులు గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియ ముగియగానే కేటగిరి వారీగా మెగా డీఎస్సీ అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.