విద్యుత్ చార్జీల తగ్గింపునకు చర్యలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:36 AM
విద్యుత్ చార్జీల తగ్గింపునకు చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు
పాకాల, డిసెంబరు 22 (ఆంరఽధజ్యోతి): విద్యుత్ చార్జీల తగ్గింపునకు చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ట్రూ అప్ చార్జీలలో ఇప్పుడు 13 పైసలు తగ్గించామని, రాబోయే రోజుల్లో మరో 50 పైసలు తగ్గేలా చర్యలు చేపడుతామని అన్నారు. గత వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. పాకాల మండలం మొగరాలలో రూ.4.09 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, కలికిరి మురళీమోహన్‌లతో కలిసి మంత్రి ప్రారంబించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అంతరాయం లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు సబ్‌స్టేషన్‌లు మంజూరు చేస్తున్నామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. అనంతరం కృష్ణాపురంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యుత్ అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలనేది ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా 51 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ లోవోల్టేజి సమస్య పరిష్కారానికి మొగరాలలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు వలపల దశరథనాయుడు, సర్పంచ్ బి.మధునాయుడు, టీడీపీ మండల కన్వీనర్ బోయపాటి నాగరాజనాయుడు, ప్రదాన కార్యదర్శి ఫల్గుణ కుమార్, జనసేన మండల కన్వీనర్ తలారి గురునాథ్, విద్యుత్ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.