Share News

ఎస్పీడీసీఎల్‌లో భారీ అవినీతి

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:52 AM

తిరుపతిలోని సదరన్‌ డిస్కం (ఎస్పీడీసీఎల్‌)లో భారీ అవినీతి జరిగిందని ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.

ఎస్పీడీసీఎల్‌లో భారీ అవినీతి
సదరన్‌ డిస్కం సీఎండీకి ఫిర్యాదు చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు, నలమోతు చక్రవర్తి తదితరులు

సంతో్‌షరావు హయాంలో అక్రమాలు ప్రారంభం

సీఎండీకి ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఫిర్యాదు

తిరుపతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని సదరన్‌ డిస్కం (ఎస్పీడీసీఎల్‌)లో భారీ అవినీతి జరిగిందని ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. గురువారం సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ ప్రతినిధులతో పాటు ఆయన తిరుపతి ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సీఎండీ శివశంకర్‌ను కలసి విద్యుత్‌ పరికరాల కొనుగోళ్ళలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నలమోతు చక్రవర్తితో కలసి మీడియాతోనూ ఆయన మాట్లాడారు. ‘ఎస్పీడీసీఎల్‌లో అవినీతి కొత్త ఒక స్థాయికి పరిమితమై ఉండేది. 2023లో సీఎండీగా సంతో్‌షరావు వచ్చాకే భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లలో నిబంధనలు పాటించలేదు. అధిక ధరలతో కొనుగోలు చేశారు. వీటి వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద డజను సార్లు దరఖాస్తు చేసినా ఎస్పీడీసీఎల్‌ స్పందించలేదు. మా దరఖాస్తులపై మొదటి, రెండవ అప్పీళ్ళకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో నల్లమోతు చక్రవర్తి రాత్రింబవళ్ళూ కష్టపడి ఆధారాలు సేకరించారు. కేసు వేయడానికి అవసరమైన వివరాలు సమకూర్చారు. నెలన్నర రోజులుగా రెండు మూడు వేదికల నుంచి ఈ వివరాలను ప్రజల ముందుంచుతున్నాం. మా ప్రయత్నాలు ఫలించో లేక యాదృచ్ఛికంగానో సంతోషరావును ఇటీవల ప్రభుత్వం రిలీవ్‌ చేసింది’ అని ఏబీవీ పేర్కొన్నారు. తమ వద్దనున్న ఆధారాలతో ప్రస్తుత సీఎండీ శివశంకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. తాను కొత్తగా వచ్చినందున పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కొంత వ్యవధి కోరారని ఆయన వివరించారు.

ఆ అవినీతి భారం ప్రజలపైనే

ఎస్పీడీసీఎల్‌లో జరిగే అక్రమాలకు అంతిమంగా ప్రజలే బాధితులవుతున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌ పరికరాలను అధిక ధరలకు కొంటే ఆ భారం వినియోగదారులైన ప్రజలపైనే పడుతుందన్నారు. రూపాయి వస్తువును రూ.మూడుకు కొంటే ఆ తేడాను ప్రజలే భరించాల్సి వస్తుందన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే వారు పారిపోతారని, ఆ డబ్బు ఇపుడైనా, ఐదేళ్ల తర్వాతైనా చెల్లించాల్సింది ప్రజలేనన్నారు. ‘ఇక ప్రజల నుంచి వసూలు చేసిన సర్‌ఛార్జీ రూ. 900 కోట్లు తిరిగి చెల్లించడానికి కూడా ఎస్పీడీసీఎల్‌ వాయిదాలు పెడుతోంది. యూనిట్‌కు 11 పైసలు చొప్పున ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తామంటున్నారు. అలా చేసినా ప్రజలకు ఎంతోకొంత ఉపశమనం కలిగించినట్లే’ అని పేర్కొన్నారు.

నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ఎస్పీడీసీఎల్‌లో అక్రమాలపై తిరుపతి ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను ఆహ్వానించామన్నారు. ఎస్పీడీసీఎల్‌లో అక్రమాలపై తమ వద్ద వున్న పూర్తి వివరాలను సమావేశంలో వెల్లడిస్తామన్నారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలతో పాటు బాధ్యత కలిగిన ప్రజలెవరైనా వచ్చి తమ వద్ద వున్న సమాచారం ఇవ్వచ్చునన్నారు. వీరితో పాటు డాక్టర్‌ బాబు సింగిరి నలగాంపల్లి సురేష్‌ తదితరులున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 12:52 AM