ముక్కంటికి బహుమానంగా పలు గ్రామాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:24 AM
గ్రామాలను బహుమానంగా ఆలయానికి ఇస్తున్నట్లు లిఖించిన శాసనాలు బయటపడ్డాయి
శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి
విజయనగరరాజు శ్రీరంగరాయ శ్రీకాళహస్తీశ్వరాలయంలో కైంకర్యాలు, అన్నదానాలు నిర్వహించడం కోసం నాడుకాడు, కంపిలి, అందలమాల, ఉప్పటేరు, దుగ్గరాజపట్టణం, పిలిగుంచలపోతు, చీమలపాడు, తిరుమూరు గ్రామాలను బహుమానంగా ఆలయానికి ఇస్తున్నట్లు లిఖించిన శాసనాలు బయటపడ్డాయి. ఆలయంలో అనువంశిక గురుకుల్‌గా సేవలందిస్తున్న డాక్టర్ పరశురామ్ ఇంట అవి పదిలంగా తరాలుగా ఉన్నాయి. శక. 1498, ధాత్రి, కార్తీక సు. 12న అనగా 1576 నవంబరు 3 శనివారం రోజున ఈగ్రామాలను దానంగా ఇచ్చినట్లు ఇందులో ఉంది. చంద్రగిరి రాజ్యంలోని పడనాడు సీమకు చెందిన బ్రాహ్మణుడు యాదాటి నరసింహభూపాల మనుమడు, తిమ్మావధాని కుమారుడు అయిన శ్రీలక్ష్మీపతి భట్టకు వీటిని దానంగా ఇచ్చినట్టు లిఖించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నైవేద్య కైంకర్యాలకు, పునరుద్ధరణ పనులకు వినియోగించాలని పేర్కొన్నారు. తిరుమూరుకు వెంగలాంబపురం అని పేరు మార్చిన అంశం కూడా ఇందులో ఉంది.
వెలుగులోకి వచ్చింది ఇలా...
శ్రీకాళహస్తీశ్వరాలయ రాజగోపురానికి ఆనుకుని ఉన్న తేరువీధిలో అనువంశిక దండాధికారి డాక్టర్ పరశురామ్ గురుకుల్ నివాసం ఉంది. వీరి వంశీయులు తరతరాలుగా పరంపరాగతంగా ఆలయంలో వైదిక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తాత పేరుతోనే నామకరణం జరుపుకున్న పరశురామ్ గురుకుల్ చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం స్విమ్స్‌లో డాక్టర్‌గా చేశారు. చదువుతోపాటు వేదం, ఆగమ, శిల్పశాస్త్రాలను అధ్యయనం చేశారు. వైద్యవృత్తికాన్నా అనువంశికంగా చేస్తున్న వైదిక కత్రువుల నిర్వహణనే ఎంచుకున్న ఆయన ప్రస్తుతం ఆలయంలో దండాఽధికారిగా ఉన్నారు. తీరిక వేళల్లో ఇంటి వద్ద వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. తమ ఇంట మంత్రబంధనంగాఉన్న పురాతన రాగిఫలకలను అపడుడపుడు తెరచేవారు. ఇటీవల కార్తీక మాసం కావడంతో వీటిని శుద్ధి చేశారు. డాక్టర్‌పరశురామ్ గురుకులు కుటుంబానికి పురోహితులుగా వ్యవహరిస్తున్న సింగరాజు మణి ఆ రాగిఫలకల మీద ఉన్న అక్షరాలను చూసి ఆసక్తితో వాటిని ఫోటోలు తీసి ఎపిగ్రఫీ డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపడంతో ఇవి విలువైన చారిత్రక ఆధారాలనే సంగతి వెల్లడైంది. రెండు జతల శాసనాలు వీరి వద్ద ఉన్నాయి. ఇవి రాజముద్రతో కూర్చి ఉన్నాయి. రెండింటిలో కలిపి మొత్తం ఐదు రాగిపలకలు ఒక గుత్తిగా ఉన్నాయి.. ఇందులో ఒక దానిపై శ్రీరామ శాసనం...మరొకదానిపై విరూపాక్ష శాసనం అని ఉంది.