అకాల వర్షాలతో మామిడికి తీవ్ర నష్టం
ABN , Publish Date - May 05 , 2025 | 01:56 AM
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆదివారం కూడా చిత్తూరుతోపాటు పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో వర్షం కురవడంతోపాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లోని మామిడి కాయలు నేల రాలాయి.
చిత్తూరు సెంట్రల్, మే 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆదివారం కూడా చిత్తూరుతోపాటు పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో వర్షం కురవడంతోపాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లోని మామిడి కాయలు నేల రాలాయి. ఇప్పటికే పెనుమూరు, యాదమరి, చిత్తూరు రూరల్, గుడిపాల, పలమనేరు, ఐరాల, తవణంపల్లె మండలాల్లో 435 ఎకరాల్లో మామిడితోపాటు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు లెక్కలు కట్టారు. తాజాగా కురిసిన వర్షం, ఈదురు గాలులకు మామిడితోపాటు సుమారు 50 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సోమవారం నుంచి నష్టం వివరాలను సేకరించనున్నారు.
విద్యుత్ శాఖకు రూ.20లక్షలకుపైగా నష్టం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన గాలివానకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఆ శాఖకు రూ.20 లక్షలకుపైగా నష్టం కలిగింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత చిత్తూరులో గాలివాన కురిసింది. నగరంలోని కొంగారెడ్డిపల్లె, విజయలక్ష్మీనగర్‌కాలనీ, కొంగారెడ్డిపల్లె, షర్మన్ పాఠశాల ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. కొన్నిచోట్ల తీగలు తెగడం, స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తప్పిన పెనుప్రమాదం
ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రవేశ మార్గం వద్ద ఆదివారం సాయంత్రం వీచిన పెను గాలులకు విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకుని మంటలు చెలరేగి, తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఎందుకంటే నీట్ రాస్తున్న తమ పిల్లల కోసం అప్పటి వరకు కళాశాల ప్రవేశ మార్గం వద్ద తల్లిదండ్రులు వేచి ఉన్నారు. గాలివాన ప్రారంభం కాగానే అందరూ కళాశాల ఆవరణలోకి వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. కళాశాల యాజమాన్యం కూడా అప్రమత్తమై సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయడంతో విద్యుత్ సరఫరాను ఆపేశారు.