మామిడి సబ్సిడీ జమ!
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:20 AM
మామిడి రైతుల విషయంలో సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. సీజన్ ప్రారంభంలో ఇచ్చిన మాట ప్రకారం కిలోకు రూ.4 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. చిత్తూరు జిల్లాలోనే రూ.146.84 కోట్ల సొమ్ము 31,929 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం జమైంది.
చిత్తూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతుల విషయంలో సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. సీజన్ ప్రారంభంలో ఇచ్చిన మాట ప్రకారం కిలోకు రూ.4 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. చిత్తూరు జిల్లాలోనే రూ.146.84 కోట్ల సొమ్ము 31,929 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం జమైంది.ఈసారి సీజన్‌లో తోతాపురి మామిడి దిగుబడి విపరీతంగా రావడం, రెండేళ్ల కిందటి గుజ్జు టన్నుల కొద్దీ జ్యూస్ ఫ్యాక్టరీల్లో అలాగే ఉండిపోవడం వంటి కారణాలతో ఈసారి రైతులకు గిట్టుబాటు ధర దక్కలేదు.దీంతో సీఎం చంద్రబాబు రైతుల నుంచి గ్రీవెన్స్ వెళ్లకముందే సీజన్ ప్రారంభంలోనే కిలోకు రూ.4 సబ్సిడీ ధర ప్రకటించారు.చిత్తూరు జిల్లాలో రూ.147 కోట్లు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు కలుపుకొంటే రూ.187 కోట్ల సబ్సిడీని తాజాగా విడుదల చేశారు. 2018లో కూడా రైతులు ఇదే తరహాలో సంక్షోభాన్ని ఎదుర్కొంటే అప్పుడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు కిలోకు రూ.2.50 చొప్పున సబ్సిడీ అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
పొరుగు రాష్ర్టాలతో పోలిస్తే
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఈసారి బంపర్ క్రాప్ వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు కిలోకు రూ.4 నుంచి రూ.4.50 మధ్యలో కొన్నాయి. మన వద్ద రూ.6 నుంచి రూ.7 వరకు ఇవ్వగా, సీజన్ ముగిసే సమయంలో రూ.8 కూడా ఇచ్చాయి. మన ప్రభుత్వం కిలోకు రూ.4 సబ్సిడీ సీజన్ ప్రారంభంలోనే ప్రకటించగా, కర్ణాటకలో మాత్రం అక్కడి కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ మేరకు కేంద్రం రూ.4 సబ్సిడీని ప్రకటించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా వేసుకున్నాయి. అందులోనూ ఒక్కో రైతుకు రూ.40 వేలు గరిష్ట సాయమనే ఆంక్షల్ని విధించారు. తమిళనాడు రైతులకు అయితే ఏ సాయం అందలేదు. సీఎం చంద్రబాబు లేఖ మేరకు సీజన్ ముగిశాక కేంద్రం కిలోకు రూ.1.86 ఇచ్చేందుకు అంగీకరించింది.
వైసీపీ హయాంలో అందని సబ్సిడీ
వైసీపీ పాలనలో మామిడి రైతులకు నయాపైసా సబ్సిడీ ఇవ్వలేదు. 2019లో అకాల వర్షాలతో మామిడికి వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు.2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా ఎగుమతుల్లేవు. 2022లో దిగుబడి లేదు. 2023లో దిగుబడి బాగా వచ్చినా ఫ్యాక్టరీలు సిండికేట్‌గా మారి కనీస మద్దతు ధర ఇవ్వలేదు. రైతులతో కలిసి ప్రతిపక్షాలు, రైతు సంఘ నాయకులు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.
సవాలుగా తీసుకున్న కలెక్టర్, యంత్రాంగం
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించింది. కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాలతో గుజ్జు ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించి రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రారంభంలో పొరుగు రాష్ట్రాల కాయలు రాకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టడి చేశారు. కలెక్టర్‌తో పాటు జేసీ విద్యాధరి, హార్టికల్చర్ డీడీ మధుసూదన రెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దార్లు రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు రెండు నెలలు క్షేత్రస్థాయిలో పర్యటించారు.ఆగస్టులో రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో పరిశీలించి ఆన్‌లైన్ చేశారు. మంగళవారం రైతులకు సబ్సిడీ జమయ్యేవరకు అదేపనిలో ఉన్నారు.
ఆలస్యానికి కారణం..
జూన్, జూలై నెలల్లో సీజన్ ఉండగా, ఆగస్టులో సిబ్బంది నమోదు చేసుకున్న జాబితాలు సరిపోలేదని మరోసారి రైతు సేవా కేంద్రాల్లో వెరిఫై చేశారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకోని రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు రావు. దీంతో అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు రీవెరిఫికేషన్‌తో పాటు ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ మొత్తం జాబితాను మళ్లీ ఆన్‌లైన్ చేశారు. ఇదంతా చేసేందుకు నెలకుపైగా సమయం పట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని ముందే విడుదల చేసినా, రైతుల ఖాతాల్లో జమ చేయడం ఆలస్యమైంది.
పూతలపట్టు నియోజకవర్గంలోనే ఎక్కువ
రైతులకు విడుదల చేసిన సబ్సిడీని పరిశీలిస్తే మామిడి సాగు అధికంగా ఉన్న పూతలపట్టు నియోజకవర్గానికి అధికంగా వచ్చింది. బంగారుపాళ్యంలో 5277 మంది రైతులకు రూ.25.11 కోట్లు, తవణంపల్లెలో 3204 మందికి రూ.14.63 కోట్లు, ఐరాలలో 3241 మందికి రూ.14.25 కోట్లు, పూతలపట్టులో 2396 మందికి రూ.11.48 కోట్లు, యాదమరిలో 1797 మందికి రూ.8.19 కోట్లను జమ చేశారు.తక్కువగా గుడుపల్లె మండలంలోని 9 మందికి రూ.3.30 లక్షలు మంజూరు చేశారు. ఆ తర్వాత పుంగనూరు, నిండ్ర మండలాల్లో వరుసగా 24, 28 మందికి రూ.10 లక్షలు, రూ.20.90 లక్షలు చొప్పున ఇచ్చారు.
రూ.146.84 కోట్ల సబ్సిడీ జమ చేశాం
జిల్లాలోని మామిడి రైతుల ఖాతాల్లో కిలోకు రూ.4 చొప్పున రూ.146.84 కోట్ల సబ్సిడీ సొమ్మును జమ చేసినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 31,929 మంది రైతుల నుంచి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేశామన్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకోని రైతులు, నేరుగా ట్రేడర్స్‌కు మామిడి అమ్మిన రైతులకు సబ్సిడీ జమ కాలేదన్నారు. అలాంటి వారు ఈ నెలాఖరులోగా రైతు సేవా కేంద్రాలు, మండల హార్టికల్చర్ ఆఫీసుల్లో వినతిపత్రాలు అందించాలని కోరారు. అర్హతను 48 గంటల్లో నిర్ధారించి జాబితా సిద్ధం చేస్తామన్నారు. ఇదివరకే అర్హత పొంది బ్యాంకుల్లో డబ్బులు పడనివారు కూడా అర్జీలు ఇవ్వొచ్చన్నారు. 21 మంది రైతులకు రూ.5 లక్షలకు మించి సబ్సిడీ అందనున్న నేపథ్యంలో, వీరి అర్హతను మరోసారి పరిశీలించనున్నట్లు తెలిపారు.
మూడు ఫ్యాక్టరీలకు ప్రోత్సాహకాల నిలిపివేత
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు మద్దతు ధర ఇవ్వని మూడు మామిడి పల్ప్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ప్రోత్సాహకాలను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. గుడిపాల, పుంగనూరు, బంగారుపాళ్యం మండలాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదన్నారు. ఏపీఐఐసీ ద్వారా కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ డీడీ మధుసూదన రెడ్డి పాల్గొన్నారు.