మామిడి రైతుల సబ్సిడీ సొమ్ము రూ.150 కోట్లు త్వరలో జమ
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:11 AM
జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన తోతాపురి మామిడికి ప్రభుత్వం కిలోకు రూ.4చొప్పున అందించనున్న సబ్సిడీ సొమ్ము రూ.150 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాలకు జమచేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన తోతాపురి మామిడికి ప్రభుత్వం కిలోకు రూ.4చొప్పున అందించనున్న సబ్సిడీ సొమ్ము రూ.150 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాలకు జమచేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో మామిడి పంటను వివిధ ఫ్యాక్టరీలకు తరలించిన రైతుల జాబితా సమగ్రనివేదికపై అధికారులతో సమీక్షించారు. సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉందన్నారు. జూన్ నెలవరకు సేకరించిన మామిడికి సబ్సిడీ జూలైలో, జూలైలో సేకరించిన మామిడికి సబ్సిడీ ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి జమచేస్తామన్నారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నులతో కూడిన 22,435 మంది రైతుల వివరాలను మండలస్థాయి బృందాలకు అందిస్తామన్నారు. ఆ వివరాలను మండల వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు గ్రామస్థాయి అధికారులతో వెళ్లి క్షేత్రస్థాయిలో రైతుల వద్ద వాటిని సరిచూసుకోవాలన్నారు. అక్కడే రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్, ఈ-క్రాప్ పంటలను పరిశీలించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు తరలించిన మామిడి రైతులకు కూడా ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని ప్రకటించారు. అట్టి జాబితాను వేరుగా సిద్ధం చేయాలన్నారు. రొంపిచెర్ల, పులిచెర్ల, బంగారుపాళ్యం, యాదమరి, సదుం, పలమనేరు మండలాల అధికారులతో రైతుల వివరాలపై కలెక్టర్ ఆరాతీశారు. జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, పట్టుశాఖ జేడీ పద్మావతి, మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్‌తో పాటు మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.