40 గ్రామాలకు మహర్దశ
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:23 AM
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన (పీఎంఏజీవై) ద్వారా జిల్లాలో ఎస్సీ జనాభా అధికంగా వున్న 40 గ్రామాలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.ప్రధానంగా అంతర్గత రహదారులు, కాలువల నిర్మాణాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ పనులు, కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
పీఎంఏజీవైకి రెండో విడతలో ఎంపిక
రూ.8 కోట్లు కేటాయించిన కేంద్రం
రూ.12.59 కోట్లతో జరగనున్న అభివృద్ధి పనులు
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన (పీఎంఏజీవై) ద్వారా జిల్లాలో ఎస్సీ జనాభా అధికంగా వున్న 40 గ్రామాలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.ప్రధానంగా అంతర్గత రహదారులు, కాలువల నిర్మాణాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ పనులు, కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. పీఎంఏజీవైతో పాటు ఆర్థిక సంఘం, ఎంపీ ల్యాడ్స్, ఉపాధి హామీ పథకం నిధులు కలిపితే రూ.60 నుంచి రూ.80 లక్షల వరకు సమకూరుతాయి. పీఎంఏజీవైలో ఇంతకుముందు 50 శాతం ఎస్సీ జనాభా వున్న పల్లెలను ఎంపిక చేయగా, ప్రస్తుతం 40 శాతం ఉన్నవాటికే నిధులు కేటాయించారు.ఈ పథకం కింద ఎంపికైన పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20 లక్షల చొప్పున కేంద్రం రూ.8 కోట్ల మేర కేటాయించింది. వీటితో పనులు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఎంఏజీవైకి ఎంపికైన పంచాయతీల్లో ముందుగా ప్రణాళికలు తయారుచేసి గ్రామసభ తీర్మానం పొందాలి. తర్వాత ప్రభుత్వానికి నివేదించి అనుమతి వచ్చాక పనులు చేపట్టాలి. ఈ పథకంలో రూ.20 లక్షల నిధులు కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈనెల 25లోగా ఆయా వివరాలను పంపాలని ఆదేశాలు రావడంతో సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు.
రెండో విడతలో...
పీఎంఏజీవైకి తొలివిడతలో 18 గ్రామాలను ఎంపిక చేయగా, రెండో విడతలో 11 మండలాల్లోని 40 పంచాయతీలను ఎంపికచేశారు. చిత్తూరు మండలంలో ఆనగల్లు, అనంతాపురం, చింతలగుంట, గువ్వకల్లు, పచ్చనపల్లి, పెరుమాళ్ళకండ్రిగ, బంగారుపాళ్యం మండలంలో జంబువారిపల్లి, నలగాంపల్లి, గంగాధరనెల్లూరు మండలంలో అంబోదరపల్లి, ఆత్మకూరు, మూర్తినాయనిపల్లి, ముక్కళత్తూరు, బొజ్జనాయనిపల్లి, పాతవెంకటాపురం, వీరకనెల్లూరు, వేల్కూరు, గుడిపాల మండలంలో మరకాలకుప్పం, శ్రీరంగంపల్లి, పశుమంద, ఖైదుగానికండ్రిగ, కార్వేటినగరం మండలంలో గోపిశెట్టిపల్లి, ఆర్కేవీబీపేట, నగరి మండలంలో మేలపట్టు, పాలసముద్రం మండలంలో తిరుమలరాజుపురం, శ్రీరంగరాజపురం మండలంలో కొండ్రాజపురం, కటికపల్లి, ముద్దికుప్పం, పాతపాళ్యం, వెంకటాపురం, ఒడ్డుపల్లి, డి.కె. మర్రిపల్లి, ఎస్.ఎస్. రాజపురం, తవణంపల్లె మండలంలో దిగువ తడకర, ఈచనేరి, మత్యం, చిన్నముడుగుపల్లి, వెదురుకుప్పం మండలంలో అగ్గిచేనుపల్లి, దేవరగుడిపల్లి, తిప్పినాయుడుపల్లి, యాదమరి మండలంలో కోణాపల్లి ఎంపికయ్యాయి.
147 పనులకు ప్రతిపాదనలు
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన కింద ఎంపికైన 40 గ్రామాలకు కేంద్రం కేటాయించిన నిధులకు తోడు కన్వర్జెన్సీ నిధులు కలిపి రూ.12.59 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 58 పనులు, ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా 89 పనులకు రూ.4.59 కోట్లు కన్వర్జెన్సీ నిధులుగా చూపారు.