Share News

కారును ఢీకొన్న లారీ

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:29 AM

మలుపు వద్ద అదుపు తప్పిన లారీ.. కారును ఢీకొనడంతో తల్లీ కొడుకులు దుర్మరణం చెందారు. కోడలికి తీవ్రగాయాలు కాగా, మనవరాలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతులది కర్నూలు. చెన్నై వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రేణిగుంట- కడప మార్గంలోని చైతన్యపురం క్రాస్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కారును ఢీకొన్న లారీ

తల్లీ కొడుకుల దుర్మరణం

మరొకరికి తీవ్రగాయాలు

స్వల్పగాయాలతో బయటపడిన చిన్నారి

మృతులది కర్నూలు

రేణిగుంట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మలుపు వద్ద అదుపు తప్పిన లారీ.. కారును ఢీకొనడంతో తల్లీ కొడుకులు దుర్మరణం చెందారు. కోడలికి తీవ్రగాయాలు కాగా, మనవరాలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతులది కర్నూలు. చెన్నై వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రేణిగుంట- కడప మార్గంలోని చైతన్యపురం క్రాస్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రేణిగుంట సీఐ జయచంద్ర తెలిపిన ప్రకారం.. కర్నూలు నగరానికి చెందిన చంద్రభానుసింగ్‌ చెన్నైలోని మెడికల్‌ ఏజెన్సీలో బిజినెస్‌ మేనేజర్‌. ఆయన భార్య దివ్య చెన్నైలోనే బరోడా బ్యాంక్‌ రీజినల్‌ ఆఫీసర్‌. వారాంతపు సెలవులు కర్నూలులో గడిపారు. సోమవారం సాయంత్రం కర్నూలు నుంచి కారులో తన తల్లి సరస్వతిబాయి, భార్య దివ్య, కుమార్తె త్రిషికతో కలిసి చంద్రభాను సింగ్‌ చెన్నై బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున రేణిగుంట మండలం చైతన్యపురం క్రాస్‌ వద్దకు కారు చేరుకుంది. అదే సమయంలో రేణిగుంట నుంచి కడప వెళ్తున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి కారుని ఢీకొంది. కారు నడుపుతున్న చంద్రభానుసింగ్‌ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. పక్కన కూర్చున్న దివ్యకు రెండు కాళ్లు విరగడంతో పాటు తలకు ఓవైపు తీవ్రగాయాలయ్యాయి. వెనక సీటులోని సరస్వతి బాయి తలకు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్‌ సీటుకు వెనుక కూర్చున్న త్రిషిక స్వల్పగాయాలతో బయటపడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. అనంతరం వాహనంలో క్షతగాత్రులను తరలిస్తుండగా మార్గమధ్యంలో సరస్వతిబాయి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దివ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 01:29 AM