గరుడ వాహనంపై శ్రీమహావిష్ణువుగా..
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:17 AM
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారి ప్రియ వాహనమైన గరుడుడిపై లోకమాత ఊరేగారు. శ్రీవారి పాదాలు, సహస్ర లక్ష్మీకాసుల హారంతో ఉత్సవమూర్తిని అలంకరించారు. తన పతి శ్రీమహావిష్ణువు రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు.
తిరుచానూరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారి ప్రియ వాహనమైన గరుడుడిపై లోకమాత ఊరేగారు. శ్రీవారి పాదాలు, సహస్ర లక్ష్మీకాసుల హారంతో ఉత్సవమూర్తిని అలంకరించారు. తన పతి శ్రీమహావిష్ణువు రూపంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. కళాబృందాలు, ప్రదర్శనలు, జీయర్ స్వాముల ప్రబంధ పారాయణం, వేదగోష్ఠి, భక్తుల గోవిందనామస్మరణ మధ్య రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ మొదలైంది. గరుడుడిపై అమ్మవారిని తిలకించడానికి తరలివచ్చిన భక్తులతో మాడవీధులు, పుష్కరిణి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం సర్వభూపాల వాహనసేవ వైభవంగా జరిగింది. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకైంకర్యాల అనంతరం అద్దాల మండపం నుంచి ఉత్సవర్లను వాహన మండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. దర్బార్ కృష్ణుడి అలంకారంలో తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమాల్లో జియ్యర్ స్వాములు, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, చలపతి, సుబ్బరాయుడు, సుభాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.
బంగారుతేరుపై త్రిలోక పావని
గరుడసేవకు ముందు స్వర్ణరథం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా అలంకరించి, మధ్యాహ్నం 3.30 గంటలకు ఉత్సవమూర్తిని ఆలయం నుంచి వేంచేపుగా రథ మండపానికి తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. భక్తుల కోలాటాలు, భజన బృందాల నడుమ 4.20 గంటలకు సర్వతేజోమయమైన అమ్మవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను సాక్షాత్కరించారు. స్వర్ణరథాన్ని లాగేందుకు మహిళలు పోటీపడ్డారు. అమ్మవారు శ్రీమహాలక్ష్మి రూపాన్ని ధరించి అభయప్రదానం చేశారు.
శ్రీవారి పాదాల ఊరేగింపు
గరుడోత్సవంలో అమ్మవారికి శ్రీవారి పాదాలను అలంకరించడం ఆనవాయితీ. తిరుచానూరులో గరుడసేవ రోజున అమ్మవారికి శ్రీవారు తన గుర్తుగా పాదుకలు పంపుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణ పాదుకలను తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చి అర్చకులు పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజన బృందాల నడుమ వాటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి శ్రీవారి పట్టపురాణి పద్మావతీ అమ్మవారు స్వామివారి పాదాలు ఽధరించి గరుడసేవలో తరించారు.
ఫ బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం
మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం