కామధేనువుపై కాణిపాక స్వామి
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:27 AM
కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో విఘ్ననాథుడు ఆదివారం రాత్రి కామధేను వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ఉభయదారులుగా వ్యవహరించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో విఘ్ననాథుడు ఆదివారం రాత్రి కామధేను వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన నాయీ బ్రాహ్మణులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. మూల విరాట్‌ను శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురావడంతో ఆలయ కల్యాణ వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి వారి ఉత్సవ విగ్రహాలను కామధేను వాహనంలో వుంచి భాజాభజంత్రీల మధ్య కాణిపాక పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు.ఈవో పెంచలకిషోర్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామికి పూలంగి సేవ నిర్వహించనున్నారు.