గజ వాహనంపై గజముఖుడి విహారం
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:37 AM
కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో మంగళవారం గజవాహనంపై వినాయక స్వామి భక్తులకు దర్శమిచ్చారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో మంగళవారం గజవాహనంపై వినాయక స్వామి భక్తులకు దర్శమిచ్చారు.ఉభయదారులైన కాణిపాకానికి చెందిన వన్నియ నాయకర్ వంశస్థులు ఉదయం మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు.రాత్రి ఉభయ వరస రావడంతో అలంకార మండపంలో సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు చేసి,భక్తులకు తీర్ధప్రసాదాలను అందజేశారు.గజ వాహనంపై వుంచి మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పుర వీధుల్లో ఘనంగా ఊరేగించారు.కాగా మంగళవారం శ్రీశైల మల్లన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను తీసుకొచ్చి వరసిద్ధుడి ఆలయ అర్చకులకు అందజేశారు.ఈ కార్యక్రమాల్లో ఈవో పెంచల కిషోర్, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు,బాలాజీనాయుడు పాల్గొన్నారు.
రథోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం స్వామికి రథోత్సవాన్ని(తేరు) నిర్వహించనున్నారు.ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.రథం ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను సేఫ్టీ అధికారుల నుంచి తీసుకున్నారు.ఈవో పెంచల కిషోర్,ఈఈ వెంకటనారాయణ, ఎంపీడీవో ధనలక్ష్మి,ఎ్‌సఐ నరసింహులు తదితరులు కాణిపాకంలో రథం తిరిగే ప్రదేశాలను తనిఖీ చేశారు.రథోత్సవం సజావుగా నిర్వహించడానికి సహకరించాలని వ్యాపారులను కోరారు.రథాన్ని అలంకరించడానికి అవసరమైన వివిద రకాల పుష్పాలను తెప్పించారు.