క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్టుల పేరిట లింకులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 03:04 AM
క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్ పేరుతో లింక్‌లు పంపిస్తారు. వీటిని క్లిక్ చేసినట్లయితే బ్యాంకు ఖాతాల్లోని నగదు పూర్తిగా మాయమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్ పేరుతో లింక్‌లు పంపిస్తారు. వీటిని క్లిక్ చేసినట్లయితే బ్యాంకు ఖాతాల్లోని నగదు పూర్తిగా మాయమయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు కనిపిస్తాయి. అదే అవకాశంగా సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్, వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా గిఫ్టులంటూ నకిలీ లింకులు పంపిస్తున్నారు. చిన్న గిఫ్ట్ కార్డు గెలుచుకున్నట్లు లేదా ఆఫర్ క్లెయిమ్ చేసుకోవాలని ప్రలోభ పెట్టే సందేశాలు పంపుతారు. ఇలా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన లింక్‌లను క్లిక్ చేయకండి. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దు. పాన్‌కార్డు ఫొటో, నెంబరు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంపొద్దు. ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లు తెలిస్తే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి’ అని ఆ ప్రకటనలో ఎస్పీ సూచించారు.