ఉన్నత సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలే మార్గం
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:37 AM
ఎస్వీయూ లైబ్రరీ సైన్స్ అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సభలో వక్తల మనోభావం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సమున్నత సమాజ నిర్మాణానికి గ్రంథాలయాలే చక్కటి మార్గాన్ని నిర్దేశిస్తాయని పలువురు పేర్కొన్నారు. ఎస్వీయూ లైబ్రరీ సైన్స్ విభాగం- ఇన్‌ఫ్లిబ్‌నెట్ సంయుక్తంగా మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును చేపట్టాయి. ‘లైబ్రరీ-2047: డెమొక్రటైజింగ్ నాలెడ్జ్ టువర్డ్స్ వికసిత్ భారత్’ అంశంపై శ్రీనివాసా ఆడిటోరియం వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అంతర్జాతీయ సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఎస్వీయూ వీసీ నరసింగరావు మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించాల్సి ఉందన్నారు. గ్రంథాలయాలున్న ప్రాంతాల్లో మనుషుల్లో అవగాహన, చైతన్యం ఎక్కువగా కనిపిస్తాయని శ్రీలంక యూనివర్సిటీ వీసీ కొలిత్ వీజే శేఖర్ అభిప్రాయపడ్డారు. యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కరరావు సూచించారు. మంచి కెరీర్‌తో పాటు మంచి విలువలను పాటించాలంటే మంచి పుస్తకాలను చదవాలని ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో, పట్టణాలు, నగరాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) వీసీ ఉమాకంజిలాల్ కోరారు. గ్రంథాలయాలను డిజిటలైజ్ చేయవలసిన అవసరం ఉందని ఇన్‌ప్లిబ్‌నెట్ డైరెక్టర్ దేవకిమదల్లి చెప్పారు. సకాలంలో, సక్రమంగా గ్రంథాలయాల ద్వారా పౌరులకు సమాచారం అందితేనే ప్రజాస్వామిక.. మానవీయ విలువలు పెంపొందుతాయని అంతర్జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ కొంగర సురేంద్రబాబు పేర్కొన్నారు. పాఠకుల ఆదరణకు నోచుకునేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దాలని ఇన్‌ప్లిబ్‌నెట్ కేంద్ర ప్రతినిధి సురభి కోరారు. ఐటీతో గ్రంథాలయాలు కొత్త మార్గంలో గమనాన్ని సాగిస్తున్నాయని ఇన్‌ఫ్లిబ్ నెట్ ప్రతినిధి సుదర్శనరావు తెలిపారు. ఈ సదస్సుకు 500 మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. పేపర్, పోస్టర్, ఓరల్ ప్రెజెంటేషన్ చేశారు. దేశంలోనే సీనియర్ లైబ్రరీ సైన్స్ ప్రొఫెసర్ కరిసిద్ధప్పను, ఎస్వీ పాలిటెక్నిక్ లైబ్రేరియన్ నటరాజ నాయుడును సత్కరించారు.
సూర్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం
ఈ సదస్సు సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి 1.3 లక్షల పుస్తకాలను సేకరించి, భద్రపరిచి, డిజిటలైజేషన్ చేస్తున్న లంకా సూర్యనారాయణను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఎస్వీయూ ప్రధాన గ్రంథాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ కొంగర సురేంద్రబాబు, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కార్యదర్శి పాండ్ర సురేంద్రబాబు తదితరులు శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికతో లంకా సూర్యనారాయణను సన్మానించారు. గ్రంథాలయానికి, పుస్తక విజ్ఞాన వ్యాప్తికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. ఆయన కృషి రాబోయే తరానికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఎస్వీయూ వీసీ నరసింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, సాహిత్యవేత్తలు కోట పురుషోత్తం, డాక్టర్ నాదెండ్ల శ్రీమన్నారాయణ, వర్సిటీ కల్చరల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్ పేర్కొన్నారు.