ఆడుదాం.. ఆంధ్ర క్రీడా కిట్లు ఏమయ్యాయి?
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:53 AM
‘ఆడుదాం.. ఆంధ్రా’లో నిధుల దుర్వినియోగం జరిగిందా? క్రీడా కిట్ల నుంచి బహుమతుల ప్రదానం వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారా? పాఠశాలలకు చేరాల్సిన కిట్లు ఏమయ్యాయి? వీటిపై విజిలెన్సు విచారణ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక అందించనున్నట్లు తెలిసింది.
విజేతల ఎంపికలో వైసీపీ మార్కు రాజకీయం
వారం రోజుల్లో డీజీపీకి విజిలెన్స్ నివేదిక
‘ఆడుదాం.. ఆంధ్రా’లో నిధుల దుర్వినియోగం జరిగిందా? క్రీడా కిట్ల నుంచి బహుమతుల ప్రదానం వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారా? పాఠశాలలకు చేరాల్సిన కిట్లు ఏమయ్యాయి? వీటిపై విజిలెన్సు విచారణ కొలిక్కి వచ్చింది. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక అందించనున్నట్లు తెలిసింది.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
‘ఆడుదాం.. ఆంధ్ర’ కార్యక్రమం 2023 డిసెంబరులో ప్రారంభమైంది. గ్రామ, వార్డు స్థాయిలో ఆటలు జరిగాయి. 2024 జనవరిలో మండలస్థాయిలో, జనవరి నెలాఖరులో మున్సిపాలిటీ.. ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా స్థాయిలో వివిధ రకాల ఆటలు ఆడించారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి మండల, మున్సిపల్, నియోజకవర్గానికి సంబంధించి రూ.25,000 వంతున.. ప్రతి వార్డు, గ్రామ సచివాలయానికి రూ.10,000 చొప్పున మంజూరు చేసింది. ఇవన్నీ కలిపి చిత్తూరు జిల్లాకు రూ.81 లక్షలు, తిరుపతి జిల్లాకు రూ.83 లక్షలు వచ్చాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, కబడీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు ఆడారు. ఒక్కో ఆటకు సంబంధించి దాదాపు 10 కిట్లు శాప్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి ఆయా జిల్లాలకు పంపిణీ చేశారు. ఇవి నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమ నిర్వహణలో గోల్‌మాల్ జరిగి నిధులు దుర్వినియోగమైనట్లు విమర్శలు వచ్చాయి. దీంతో వీటిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. తిరుపతి ప్రాంతీయ విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో విచారణ సాగింది. ఈ విచారణలో కిట్ల నాణ్యతకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయిలో కొని పంపిన బ్యాట్లు, బాల్స్, షటిల్ బ్యాట్‌లు, టీ షర్టులు, కార్కులు ఇతరత్రా వస్తువులు పూర్తిగా నాణ్యత లోపించినట్లు విచారణలో తెలిసిందని ఓ అధికారి చెప్పారు. ఒక ఆటలో వాడిన కిట్లు.. రెండో ఆటకు పనికి రాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్సు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు.. ప్రభుత్వం సరఫరా చేసిన క్రీడా కిట్లను ఆడుదాం-ఆంధ్ర ఆటలు ముగిశాక సంబంధిత పాఠశాలలకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, అప్పట్లో ఆ కిట్లు పాఠశాలలకు చేరలేదని తెలిసింది. ఆ కిట్లు ఏమయ్యాయనే దిశగానూ విజిలెన్సు అధికారులు విచారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విజేతల ఎంపికలోనూ వైసీపీ మార్కు రాజకీయం సాగినట్లు ఆరోపణలున్నాయి. తమకు కావాల్సిన కార్యకర్తలను విజేతలుగా ఎంపిక చేసినట్లు విమర్శలున్నాయి. కొన్నిచోట్ల విజేతల అకౌంట్లలో డబ్బులు జమ చేయనట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఇలా.. అన్ని కోణాల్లోనూ విచారణ ముగించిన అధికారులు.. వారం రోజుల్లో డీజీపీకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.