Share News

ఆడుదాం.. ఆంధ్ర అవినీతి అంతులేనంత!

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:27 AM

ఆడింది 47 రోజులు. ఖర్చుపెట్టింది రూ.ఐదారు కోట్లు. దుర్వినియోగమైనట్లు విజిలెన్సు అధికారులు గుర్తించింది రూ.1.10 కోట్లు. ఇదీ ‘ఆడుదాం- ఆంధ్ర’ లెక్క.

ఆడుదాం.. ఆంధ్ర అవినీతి అంతులేనంత!

ఉమ్మడి జిల్లాలో రూ.1.10 కోట్ల దుర్వినియోగం

ముగిసిన విజిలెన్సు విచారణ

ఆడింది 47 రోజులు. ఖర్చుపెట్టింది రూ.ఐదారు కోట్లు. దుర్వినియోగమైనట్లు విజిలెన్సు అధికారులు గుర్తించింది రూ.1.10 కోట్లు. ఇదీ ‘ఆడుదాం- ఆంధ్ర’ లెక్క.

- తిరుపతి(నేరవిభాగం)

‘ఆడుదాం.. ఆంధ్ర’ అన్నారు. అవినీతి క్రీడకు తెరతీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.1.1 కోట్ల స్వాహాకు పథకం వేశారు. ఇదంతా విజిలెన్సు విచారణలో వెలుగు చూసినట్లు తెలిసింది. గతేడాది సార్వత్రి ఎన్నికలకు ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమాన్ని ఆర్బాటంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజిలెన్సు విచారణకు ఆదేశించింది. తిరుపతి ప్రాంతీయ విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ నేతృత్వంలో దాదాపు 10 మంది అధికారులు నగరి నియోజకవర్గం నుంచీ విచారణ మొదలు పెట్టి జిల్లా మొత్తం సమగ్రంగా పూర్తి చేశారు. క్రీడా పోటీలకు సంబంధించి పరికరాలు, టీ షర్టుల కొనుగోళ్లు, విజేతల ఎంపికలో అక్రమాలు, పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై బ్రాండెడ్‌ స్టిక్కర్లు, క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిసింది. అలాగే, విజేతలుగా కూడా వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు అధికారులు గుర్తించారు. వివిధ క్రీడల కింద క్రీడాకారులు ఆటలు ఆడినట్లు లెక్కలు చూపించినట్లు సమాచారం. దీంతో పాటు జిల్లా క్రీడా సంఘాల నుంచి ఖర్చు చేసిన మొత్తం కూడా ఈ స్కాం కిందకు వస్తుందని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగానూ విజిలెన్సు అధికారులు విచారించారు. ఇక, ముగింపు ఉత్సవాల సందర్భంగానూ నిధుల దుర్వినియోగంపైనా దృష్టి పెట్టారు. ఇలా అన్ని కోణాల్లో విచారించిన అధికారులు.. సుమారు రూ.1.10 కోట్లు దుర్వినియోగమైనట్లు నిగ్గు తేల్చినట్లు సమాచారం. కర్నూలు విజిలెన్సు విభాగం ద్వారా ప్రభుత్వానికి రెండు రోజుల్లో ఈ నివేదిక అందించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ప్రభుత్వం కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి.

Updated Date - Aug 12 , 2025 | 01:27 AM