‘జీరో వేస్ట్’ జిల్లాగా మారుద్దాం
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:42 AM
తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన స్వచ్ఛత విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు
తిరుపతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గార్బేజ్‌లో ‘జీరో వేస్ట్’ జిల్లాగా తిరుపతిని మారుద్దామని ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన స్వచ్ఛత విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికకావడం ఆనందంగా ఉందన్నారు. మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందన్నారు. దేశంలోనే స్వచ్ఛతలో భాగంగా రాష్ట్రానికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మునిసిపాలిటీలకు స్వచ్ఛ అవార్డు రావడానికి పారిశుధ్య కార్మికులు చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. తిరుపతిని అభివృద్ధి పథంలో తీసుకురావాలని కమిషనర్ మౌర్యకి సూచించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నగరంలో పారిశుధ్యం పడకేసిందని అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అవార్డు పొందటంలో కమిషనర్, సిబ్బంది కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. యూడీఎస్ నిర్మాణంతోపాటు కార్పొరేషన్ పరిపాలన భవనాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రికి విజ్జప్తి చేశారు. దేశంలోనే పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఉత్తమ స్థానంలో నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. సూపర్ స్వచ్ఛ లీగ్‌లో తిరుపతి రావడం గర్వకారణంగా ఉందన్నారు. పారిశుధ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. తిరుపతి నగరంలో పొగుపడే 250 టన్నుల చెత్తను నిర్వహణ చేసి జీరో వేస్ట్ సిటీగా మార్చుతామన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీలో 7 స్టార్ రేటింగ్ సాధించేందుకు కృషిచేస్తామన్నారు. ఈ సందర్భంగా అధికారులు, పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, ఏపీజీబీసీ చైర్‌పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, హస్త కళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, డిప్యూటీ మేయర్లు ఆర్సీ మునికృష్ణ, ముద్ర నారాయణ, నాయీ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం, వూకా విజయకుమార్, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అనిత, రుద్రరాజు శ్రీదేవితో పాటు కుమారమ్మ, కరాటే చంద్ర, ఏడీసీ చరణ్ తేజ్ రెడ్డి, డీసీ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, ఆర్వో సేతుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.