Share News

బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:54 AM

రండి... బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దాం... కాషాయీకరణ... వ్యాపారీకరణ... కేంద్రీకరణను అడ్డుకుందాం... అంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 25వ రాష్ట్ర మహాసభల్లో పలువురు నాయకులు ఈ మేరకు పిలుపునిచ్చారు.

బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దాం
సభలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ లక్ష్మణరావు

తిరుపతి(విద్య), డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రండి... బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దాం... కాషాయీకరణ... వ్యాపారీకరణ... కేంద్రీకరణను అడ్డుకుందాం... అంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 25వ రాష్ట్ర మహాసభల్లో పలువురు నాయకులు ఈ మేరకు పిలుపునిచ్చారు. పీడీఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడు తూ సమాజంలో పేదల పక్షాన నిలబడే బాధ్యత విద్యార్థులదేనన్నారు. విద్య పూర్తిగా వ్యాపారమైనపోయిన ఈ తరుణంలో పోరాటాలు అవసరమన్నారు. ఎన్నికలకు ముందు జీవో 77ను రద్దు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేశ్‌ ఆ హామీని విస్మరించారన్నారు. పాఠశాలలను 9 రకాలుగా విభజించి 25వేల స్కూళ్లను మూతవేశారని చెప్పారు. రాష్ట్రంలోని 66 లక్షల మంది విద్యార్థుల్లో 34 లక్షల మంది ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలోనే చదవాల్సి వస్తోందని వివరించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ హక్కుగా ప్రసాదించిన విద్యాహక్కును నేటి పాలకులు విస్మరిస్తున్నారన్నారు. నాణ్యమైన, సమానమైన ఉన్నత విద్యకోసం ఎస్‌ఎఫ్‌ఐ చేసే పోరాటాల్లో యూటీఎఫ్‌ క్రియాశీలక భాగస్వామి అవుతుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యావిధానాలవల్ల డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట ఫలాలలను అదానీ, అంబానీలకు మోదీ ప్రభుత్వం దోచిపెడుతోందని విమర్శించారు. పాండిచ్చేరి యూనివర్శిటీ విద్యార్థిని, పాండిచ్చేరి యూనియన్‌ ఉపాధ్యక్షురాలు శ్రేష్ఠ మాట్లాడుతూ నిరంతర పోరాటమే మార్పునకు మార్గమని పేర్కొన్నారు. రెండోరోజు కార్యక్రమాల్లో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్‌ ఎం సాజి, కార్యదర్శి శ్రీజన్‌ భట్టాచార్య, రాష్ట్ర అధ్యక్ష, కర్యాదర్శులు కె.రామ్మోహన్‌, కె. ప్రసన్నకుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్‌, భగత్‌రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 01:54 AM